Rupee | ముంబై, డిసెంబర్ 12: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతూనే ఉన్నది. గురువారం మరో 5 పైసలు దిగజారి ఫారెక్స్ మార్కెట్లో ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ 84.88 వద్దకు క్షీణించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు, దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు.. రూపీని ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే విదేశీ బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీగా డిమాండ్ కనిపించింది.
నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ విజయం సాధించిన దగ్గర్నుంచి కరెన్సీ మార్కెట్లో డాలర్ పరుగులు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇతర దేశాల కరెన్సీల పతనం కూడా ఆరంభమైంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లోని అన్ని కరెన్సీల విలువ క్రమేణా పడిపోతున్నదని ఫారెక్స్ ట్రేడర్లు గుర్తుచేస్తున్నారు. బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) సభ్య దేశాలపై 100 శాతం సుంకాల పెంపు ఉంటుందని ట్రంప్ హెచ్చరించడమే కారణం అంటున్నారు.
గడిచిన 4 రోజుల్లో 3 రోజులూ రూపీ నష్టాలకే పరిమితమైంది. మిగతా ఆ ఒక్కరోజు ఎక్కడిదక్కడే ఉన్నది. ఇక ఈ మూడు రోజుల ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 27 పైసలు కోల్పోవడం గమనార్హం. సోమవారం ఒక్కరోజే 20 పైసలు క్షీణించగా, బుధ, గురువారాల్లో మరో 7 పైసలు పతనమైంది. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నట్టు ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. మరోవైపు కరిగిపోతున్న దేశంలోని ఫారెక్స్ రిజర్వులు సైతం పరిస్థితుల్ని మరింతగా దిగజార్చుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 28న 704.885 బిలియన్ డాలర్లతో ఆల్‌టైమ్ హైలో ఉన్న ఫారెక్స్ రిజర్వులు.. గత నెల 22న 656.582 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. దాదాపు రెండు నెలల్లో 48.30 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.
జీడీపీ వృద్ధిరేటు పతనం.. రూపాయి మారకం విలువ క్షీణత.. పెట్టుబడుల ఉపసంహరణలు.. దేశంలో ప్రమాద ఘంటికల్నే మోగిస్తున్నాయి. రూపాయి నష్టాలు.. దేశీయ దిగుమతుల్ని భారం చేస్తుండగా, ద్రవ్యోల్బణాన్ని కూడా ఎగదోస్తున్నది. ఇప్పటికే ఆర్బీఐ వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిల్లోనే ఉంచుతున్నది. ఇప్పుడు రూపీ తీరు.. ఇకపైనా వడ్డీరేట్ల కోతలకు వీల్లేకుండా చేస్తున్నది. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వృద్ధి క్షీణించినట్లే.