Luxury Homes | వడ్డీరేట్లు భారీగా పెరిగినా.. ద్రవ్యోల్బణం ప్రభావం వెంటాడుతున్నా.. ఇండ్ల ధరలు పైపైకి దూసుకెళ్తున్నా సొంతింటి కల సాకారం చేసుకునే వారు వెనక్కి తగ్గడం లేదు. గతేడాది ఇండ్ల విక్రయాల గ్రోత్ కొనసాగుతూ వచ్చింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల విక్రయాల పరిమాణం, విలువలోనూ నూతన రికార్డులు నెలకొల్పాయి. ఇంతకుముందుతో పోలిస్తే సౌకర్యవంతమైన లగ్జరీ ఇండ్లకు గిరాకీ పెరిగింది. లగ్జరీ ఇండ్ల సేల్స్ కూడా కొత్త రికార్డులు నమోదు చేశాయి.
ఢిల్లీ సహా దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ముంబై, కోల్ కతా, చెన్నై, పుణె, బెంగళూరు, హైదరాబాద్ నగరాల పరిధిలో గతేడాది 3.79 లక్షల ఇండ్లు అమ్ముడయ్యాయని. 2021-22తో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువ. ఈ ఇండ్ల విక్రయ విలువ రూ.3.47 లక్షల కోట్లు కాగా, 2021-22తో పోలిస్తే 48 శాతం ఎక్కువ అని రియాల్టీ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ గ్రూప్ తెలిపింది.
ఇండ్ల విక్రయాల పరిమాణం, విలువలోనూ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ముందు వరుసలో నిలుస్తుంది. ఇండ్ల విక్రయాల్లో 30, అమ్ముడైన ఇండ్ల విలువలో 48 శాతం ఎక్కువ. ముంబై తర్వాతీ స్థానంలో పుణె నిలిచింది. ఇండ్ల విక్రయ పరిమాణం పుణె పరిధిలో 17 శాతం పెరిగితే, విలువ పరంగా 15 శాతం గ్రోత్ తో ఢిల్లీ-ఎన్సీఆర్ నిలిచింది.
గత ఏడాది కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్ల విక్రయాల్లో రికార్డు స్థాయి గ్రోత్ నమోదైంది. పుణెలో అత్యధిక గ్రోత్ 77 శాతం నమోదైతే,, హైదరాబాద్, బెంగళూరు 50 శాతానికి చేరువలో నిలిచాయి.
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇండ్లకు గిరాకీ పెరిగింది. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ రూ.1.5 కోట్లకు పైగా విలువ గల ఇండ్ల వైపే మొగ్గుతున్నారు. లార్జర్ స్పేస్ మొదలు సౌకర్యవంతమైన జీవన విధానం, ప్రైడ్ ఆఫ్ ఓనర్సిప్ వంటి ఇండ్లకు ఇప్పుడు గిరాకీ పెరుగుతున్నది.
‘సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్న వారిలో లగ్జరీ హౌసింగ్ పట్ల మోజు పెరుగుతున్నది. సంపాదనకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు మారుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు స్పేసియస్ ఇళ్లు, జీవన సరళికి అనుగుణంగా ఉన్న ఇండ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు’ రియాల్టీ కన్సల్టెన్సీసంస్థ అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు.
ముంబై మెట్రో పాలిటన్ రీజియన్, ఢిల్లీ-ఎన్సీఆర్ తోపాటు బెంగళూరు నగరాల పరిధిలో లగ్జరీ ఇండ్లకు గిరాకీ ఎక్కువైంది. ఆ బాటలో పుణె కూడా వచ్చి చేసింది. ఇంతకుముందుతో పోలిస్తే 2022-23లో లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లు రికార్దు స్థాయిలో తొమ్మిది శాతం పెరిగాయి.