Railway Super App | రైల్వేలలో పలు రకాల సర్వీసుల కోసం వేర్వేరుగా యాప్స్, వెబ్ సైట్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, అన్ రిజర్వుడ్ టికెట్ల కోసం యూటీఎస్, ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ఫిర్యాదులు-ఫీడ్ బ్యాక్ కోసం రైల్ మదద్ తదితర యాప్స్ పని చేస్తున్నాయి. వీటితోపాటు రైలు ప్రయాణ స్టేటస్ తెలుసుకునేందుకు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉంది. వేర్వేరుగా ఉన్న సర్వీసులన్నీ ఒకే చోట ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి సూపర్ యాప్ తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారతీయ రైల్వే అధికార వర్గాల కథనం.
వచ్చేనెల కల్లా సూపర్ యాప్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. భారతీయ రైల్వేల ’సూపర్ యాప్’ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) డెవలప్ చేస్తోంది. దీన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో అనుసంధానించే ప్రక్రియ నడుస్తుందని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. ప్రతిపాదిత సూపర్ యాప్ వినియోగంలోకి వస్తే ట్రైన్ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫామ్ టికెట్, అన్ రిజర్వుడ్ టికెట్ ఒకే చోట బుక్ చేసుకోవచ్చు. ఒక రైలు ప్రయాణ స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.