న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కు తొలిరోజే మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా మరింత వాటాను అమ్మాలని కేంద్రంలోని మోదీ సర్కారు నిర్ణయించింది.
గురువారం రిటైల్ మదుపరుల కోసం మరో 19.25 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. ఇది బేస్ ఆఫర్ సైజ్‌కు 1 శాతానికి సమానం. తొలుత 38.51 కోట్ల షేర్ల (2 శాతం)ను విక్రయానికి తెచ్చారు. అయితే నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కేటాయించిన 34.66 కోట్ల షేర్లను మించి 41 కోట్లకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. షేర్ ధర రూ.34గా ఉన్నది.