ముంబై, అక్టోబర్ 1 : దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. బుధవారం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ భారీ లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యసమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థల షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ అంచనాలను ఆర్బీఐ పెంచడం, అలాగే ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించడం కలిసొచ్చింది. అంతేగాక ద్రవ్యోల్బణం తగ్గినా, అమెరికా సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైనా..
కీలక వడ్డీరేట్లకు తప్పక కోత పెడుతామంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన భరోసా ఇన్వెస్టర్లను పెట్టుబడుల దిశగా నడిపించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 715.69 పాయింట్లు కోలుకుని 80,983.31 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 800.81 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 225.20 పాయింట్లు లేదా 0.92 శాతం పెరిగి 24,836.30 వద్ద నిలిచింది. సెన్సెక్స్ షేర్లలో టాటా మోటర్స్ విలువ అత్యధికంగా 5.54 శాతం పుంజుకున్నది. కొటక్ మహీంద్రా, ట్రెంట్, సన్ ఫార్మా, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లూ లాభపడ్డాయి.