Q3 Results | ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ రూ.18 వేల కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. షేర్ల బై బ్యాక్ ఆఫర్ కింద షేర్ విలువను రూ.4,500గా ఖరారు చేసింది. ఇది గత ట్రేడింగ్‌లో టీసీఎస్స్క్రిప్ట్ విలువలో 16.7 శాతం. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం లాభాల్లో 12.3 శాతం గ్రోత్ సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,701 కోట్ల లాభాలు గడించింది. ఈ ఏడాది రూ.9,769 కోట్లకు పెంచుకున్నది. ఇక ఆదాయం రూపంలో 16.3 శాతం వృద్ధి నమోదు చేసింది. 2020-21లో రూ.42,015 కోట్ల ఆదాయం లభిస్తే, 2021-22లో రూ.48,885 కోట్ల రెవెన్యూ వచ్చింది. వాటాదారులకు షేర్‌పై రూ.7 మూడో ఇంటరిం డివిడెండ్ ప్రకటించింది.
ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో కూడా బుధవారం ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. ఇన్ఫోసిస్ కూడా 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో 12 శాతం గ్రోత్ సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,197 కోట్ల నికర లాభం గడిస్తే, ఈ ఏడాది రూ.5,809 కోట్ల నికర లాభాలు వచ్చాయని బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది.
దేశంలోని మరో ఐటీ దిగ్గజం విప్రో నికర లాభాల్లో మాత్రం వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నికర లాభాలు రూ.2649.7 కోట్ల నుంచి రూ.2419.8 కోట్లకు పడిపోయాయి. అయితే, నికర ఆదాయం 21 శాతం పెంచుకున్నది. గతేడాది రూ.12,596 కోట్ల రెవెన్యూ వస్తే, ఈ ఏడాది రూ.15,278 కోట్ల ఆదాయం సంపాదించింది.