న్యూఢిల్లీ/జ్యూరిచ్, జూన్ 19: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము గత ఏడాది మూడింతలకుపైగా ఎగిసింది. 2024లో దాదాపు రూ.37,600 కోట్ల (3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్)కు చేరినట్టు గురువారం స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక గణాంకాలు చెప్తున్నాయి. 2021 తర్వాత స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ మనీ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. నాడు 14 ఏండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. కాగా, స్థానిక బ్యాంక్ శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల్లోకి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని కేంద్ర బ్యాంక్ పేర్కొన్నది. నిజానికి 2023లో నాలుగేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు నిల్వలు 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు పడిపోయాయి. ఈ ఒక్క ఏడాదే 70 శాతం క్షీణించాయి. అయితే మరుసటి ఏడాదే తిరిగి సుమారు 2.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ పెరగడం గమనార్హం.
స్విస్ బ్యాంకుల్లోని భారతీయ కస్టమర్ అకౌంట్లలో డిపాజిట్లు దాదాపు రూ.3,675 కోట్లు (346 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్)గా ఉన్నాయి. గతంతో పోల్చితే 11 శాతం పెరిగాయి. అలాగే అక్కడి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మొత్తం భారతీయుల సొమ్ములో ఇది 10 శాతానికి సమానంగా ఉన్నది. ఈ మేరకు స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ)కు అక్కడి బ్యాంకులు వివరాలందించాయి. కాగా, స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ధనం 2006లో ఆల్‌టైమ్ హైని తాకుతూ దాదాపు 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా నమోదైంది. ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఈ సొమ్ము వ్యక్తులు, బ్యాంకులు, సంస్థల ద్వారా వచ్చినట్టు ఎస్ఎన్బీ తెలిపింది. డిపాజిట్లు 2007 ఆఖర్లో గరిష్ఠంగా రూ.9,000 కోట్ల (2.3 బిలియన్ డాలర్లు)కుపైగా నమోదయ్యాయి. 2018 నుంచి భారత్, స్విట్జర్లాండ్ మధ్య పన్ను సంబంధిత అంశాల్లో ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం స్విస్ ఆర్థిక సంస్థల్లో ఉన్న భారతీయులందరి ఖాతాల పూర్తి వివరాలు భారత్‌కు స్విట్జర్లాండ్ చెప్పాల్సిందే.