Bank Deposits | న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద కష్టమే వచ్చిపడింది. డిపాజిట్లు లేక ద్రవ్యలభ్యత కరువైపోయింది మరి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన పరిశోధనాత్మక నివేదిక.. భారతీయ బ్యాంకులు ఎదుర్కొంటున్న నగదు కొరత, పడిపోతున్న డిపాజిట్లకు అద్దం పడుతున్నది.
రూ.0.95 లక్షల కోట్లకు పతనం
దేశీయ బ్యాంకుల్లో నగదు లభ్యత గరిష్ఠంగా రూ.2.86 లక్షల కోట్ల నుంచి రూ.0.95 లక్షల కోట్ల కనిష్ఠానికి దిగజారినట్టు యూనియన్ బ్యాంక్ రిసెర్చ్ రిపోర్టు చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో బ్యాంకులకు దిశా-నిర్దేశం చేసినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు కనిపించకపోవడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పదేపదే బ్యాంకుల్లో తరిగిపోతున్న ద్రవ్యలభ్యతపై హెచ్చరికలు చేశారు. చివరకు ఆర్బీఐ కూడా డిపాజిట్ల వృద్ధిపై బ్యాంకులు దృష్టి పెట్టాలని, లేకపోతే సమస్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఏడాది ఆగస్టు 2న బ్యాంకుల్లో రూ.2.56 లక్షల కోట్లుగా ఉన్న ద్రవ్య లభ్యత.. 16న రూ.1.55 లక్షల కోట్లకు పడిపోయింది. 28న ఇది రూ.0.95 లక్షల కోట్లకు దిగజారింది.
ఇదీ సంగతి..
బ్యాంకుల్లో ఎఫ్డీ అంటే సురక్షితమైన పెట్టుబడి. గృహస్తులు, సీనియర్ సిటిజన్లు, ఇన్వెస్టర్ల ఆసక్తి ఎఫ్‌డీలపైనే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రిస్క్ ఉన్నప్పటికీ అధిక రాబడులనిచ్చే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపైనే దేశీయ మదుపరుల చూపు పడుతున్నది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌ల్లోకి గృహస్తులు తమ సేవింగ్స్‌ను పెద్ద ఎత్తున తరలిస్తున్నారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా చెప్పారు. ఎఫ్డీలపై వడ్డీరేట్లు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. వీటితో పోల్చితే స్టాక్ మార్కెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో 2-3 రెట్లు రాబడులు ఎక్కువగా వస్తుండటంతో అంతా ఆవైపే వెళ్తున్నారు. కానీ మార్కెట్లు నష్టపోతే ఇన్వెస్టర్లకూ నష్టాలు తప్పడం లేదు. అయినప్పటికీ ఓవరాల్‌గా లాభాలే కనిపిస్తుండటంతో అంతా ఎఫ్డీలకు బదులుగా మ్యూచువల్ ఫండ్లకే ప్రాధాన్యతనిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కఠిన చర్యలున్నా..
హై రిస్క్‌తో కూడిన పెట్టుబడుల వైపే దేశంలోని రిటైల్ ఇన్వెస్టర్లు అడుగులు వేస్తుండటంతో మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. ఈ పోకడకు బ్రేకులు వేసేందుకు కఠిన చర్యల్నే చేపడుతున్నది. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌లో పెట్టుబడులపట్ల నిబంధనల్ని కఠినతరం చేసింది. అయితే డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా వడ్డీరేట్లను పెంచాలన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ అదే జరిగితే రుణాలపై వడ్డీరేట్లనూ పెంచాల్సి వస్తుందని బ్యాంకర్లు బదులిస్తున్నారు.