న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహించే భారతీయుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. తాజాగా గ్లోబల్ ఐటీ సంస్థ, డాటా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ వీయమ్ సాఫ్ట్‌వేర్‌కు భారత సంతతికి చెందిన ఆనంద్ ఈశ్వరన్ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలోనూ ఓ సభ్యుడిగా ఉంటారు. ఇప్పటిదాకా ఉన్న విలియమ్ హెచ్ లార్జెంట్ (బిల్ లార్జెంట్) స్థానంలో కంపెనీ సారథ్య బాధ్యతలను ఆనంద్ నిర్వర్తించనున్నారు. ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చైర్మన్‌గా లార్జెంట్ ఉంటారని శుక్రవారం విడుదలైన ఓ ప్రకటనలో వీయమ్ సాఫ్ట్వేర్ తెలియజేసింది. కాగా, రింగ్సెంట్రల్ అధ్యక్షుడిగా, సీవోవోగా పనిచేసిన ఆనంద్.. అక్కడి నుంచి వీయమ్కు వచ్చారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్, ఎస్ఏపీ, హెచ్‌పీ, విగ్నెట్టి, బ్రాన్ కన్సల్టింగ్ కంపెనీల్లోనూ కీలక పదవుల్లో పనిచేశారు. ముంబై విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్న ఈశ్వరన్.. మిస్సోరి-కొలంబియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. డాటా ఎకోసిస్టమ్‌లో అంచెలంచెలుగా ఎదుగుతున్న వీయమ్ వార్షిక రికరింగ్ రెవిన్యూ ఈ ఏడాది 100 కోట్ల డాలర్లు (రూ.7,600 కోట్లపైనే) దాటింది. ఈ సంస్థకు 4 లక్షలపైనే కస్టమర్లున్నారు.