న్యూఢిల్లీ, మార్చి 10: భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధిచెందుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం వ్యయం పెంచడం, ప్రైవేటు రంగం మూలధన వ్యయం కారణంగా వృద్ధి ఈ స్థాయిలో నమోదుకావొచ్చని రేటింగ్ ఏజన్సీ పేర్కొంది. ఈ మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.9 శాతం పెరుగుతుందని అంచనా. ‘ఇండియా అవుట్‌లుక్ 2023 ఆర్థిక సంవత్సరం’ పేరుతో క్రిసిల్ విడుదల చేసిన రిపోర్ట్ వివరాలు…
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం, పెరుగుతున్న కమోడిటీ ధరల కారణంగా జీడీపీ వృద్ధి తగ్గొచ్చు.
కొవిడ్ మూడో వేవ్ కనిష్ఠంగా ఉన్నందున జీడీపీకి ఒనగూడిన ప్రయోజనం కాస్తా ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలతో ఆవిరైపోతుందని అంచనా.
రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం అంతర్జాతీయ వృద్ధికి కూడా ముప్పుగా పరిణమిస్తుంది. చమురు, లోహాల ధరల పెరుగుదలకు కారణమవుతుంది.
సగటు క్రూడ్ ధర 85-90 డాలర్ల మధ్య స్థిరంగా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం అధికస్థాయిలోనే ఉంటుంది.
భౌగోళిక ఉద్రిక్తతలతో చమురు, కమోడిటీల ధరలు ఎక్కువకాలం అధికస్థాయిలో కొనసాగితే, ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
2012-2014 ఆర్థిక సంవత్సరాల మధ్య సగటు క్రూడ్ ధర 110 డాలర్లుగా ఉన్నపుడు రిటైల్ ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదైంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రాకపోవొచ్చు. దేశంలో వ్యవసాయ దిగుబడి గణనీయంగా పెరిగినందున, ఆహారధాన్యాల దేశీ ధరలు అదుపులో ఉండటం ఇందుకు కారణం.
అధిక క్రూడ్ ధర కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 2.2 శాతానికి పెరుగుతుంది. చమురు ప్రతీ 10 డాలర్ల పెరుగుదలకూ జీడీపీ 40 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌కు మించి ఉపాధి కల్పనా పథకాలు, ఆహార సబ్సిడీకి కేటాయింపులు పెంచాలి. పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాల్ని తగ్గించాల్సి ఉంటుంది.