India Exports | అచ్చేదిన్ తీసుకొస్తామంటూ పదకొండేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తన అనాలోచిత నిర్ణయాలతో అన్ని రంగాలనూ అస్తవ్యస్తం చేసింది. రూపాయి పతనం కనిష్ఠ స్థాయికి చేరుకోగా, ఇప్పుడు ఎగుమతుల్లోనూ దేశం అట్టడుగునకు దిగజారింది.
స్వాతంత్య్ర కాలం నాటికి అంతర్జాతీయ ఎగుమతుల్లో దేశ వాటా 2.2 శాతంగా ఉండగా, ప్రస్తుతం అంతకన్నా తక్కువ 1.6 శాతం నమోదైంది. ఏడున్నర దశాబ్దాల కిందటితో పోల్చిచూస్తే దేశీయ ఎగుమతులు దారుణంగా పతనమవడం గమనార్హం.
మరి, ‘మేకిన్ ఇండియా ’ ఆడంబరం ఏమైనట్టు? ‘విశ్వగురు భారత్’ ఎందుకిట్ల మారినట్టు?
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ) : ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పుష్టిగా ఉంటుందంటారు ఆర్థిక నిపుణులు. ఎగుమతుల విలువ పెరిగితే.. అంతర్జాతీయంగా ఆ దేశానికి పరపతి పెరుగుతుంది. దౌత్య సంబంధాలు బలపడటంతో పాటు విదేశీ కరెన్సీ నిల్వలు పెరుగుతాయి. దేశీయంగా కంపెనీల సంఖ్య పెరిగి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. అయితే, ప్రధాని నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయంగా వివిధ అంశాల్లో దేశ పరపతి పడిపోతూనే ఉన్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో తాజాగా దేశీయ ఎగుమతుల విలువ చరిత్రలో చూడనటు వంటి స్థాయికి దిగజారింది.
కీలక రంగాల్లో ఎగుమతులు అంతకంతకూ పడిపోతున్నాయి. పెట్రోలియం, నేత వస్ర్తాలు-దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రత్నాలు-ఆభరణాలు వంటి కార్మిక శక్తి అధికంగా ఉన్న రంగాలు తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోయాయి. గత ఫిబ్రవరిలో ఆయా దేశాలకు భారత్ నుంచి జరిగిన ఎగుమతుల విలువ 36.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. నిరుడు ఇదే నెలతో పోలిస్తే ఎగుమతుల్లో క్షీణత 10.9 శాతంగా రికార్డయ్యింది. ఏడాది వ్యవధిలో దేశీయ వస్తు ఎగుమతుల విలువ 4.5 బిలియన్ డాలర్ల మేర క్షీణించినట్టు తెలుస్తోంది. 1948లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 2.2%గా నమోదవ్వగా.. 2025లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 1.6%గానే రికార్డయ్యింది. అంటే స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశీయ ఎగుమతులతో పోలిస్తే.. బీజేపీ ప్రభుత్వ హయాంలో వస్తు ఎగుమతుల వాటా మరింతగా పతనమైంది.
దేశీయ కంపెనీలను, ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తద్వారా ఎగుమతులను పెంచడానికంటూ 2014 సెప్టెంబర్ 25న ‘మేకిన్ ఇండియా’ పేరిట బీజేపీ సర్కారు ఓ ఆర్భాటపు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తయారీ రంగంలో ఏటా 12-14 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తామని, 2022 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచి 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టింది. అయితే, పదేండ్ల అనంతరం ‘మేకిన్ ఇండియా’ ‘జోకిన్ ఇండియా’గా మారినట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 35,567 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) మూతబడినట్టు ఇటీవల ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్ వేదికగా సమాధానమిచ్చింది. 2019 జూలై నాటికి దేశవ్యాప్తంగా 6.8 లక్షల కంపెనీలు మూతబడ్డట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ ఏడాది పేర్కొనడం తెలిసిందే. దీన్ని బట్టి రోజుకు సగటున దేశవ్యాప్తంగా 300 కంపెనీలు మూతబడుతున్నట్టు కార్మిక హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా అట్టర్ఫ్లాప్గా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
1947-48లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 2.2 శాతం
2024-25లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 1.6 శాతం
2024 ఫిబ్రవరిలో 41.4 బిలియన్ డాలర్లు
2025 ఫిబ్రవరిలో 36.9 బిలియన్ డాలర్లు
ఏడాది వ్యవధిలో పతనం 4.5 బిలియన్ డాలర్లు
నేత వస్ర్తాలకు సంబంధించి బంగ్లాదేశ్, వియత్నాం వంటి చిన్న దేశాలు ఎగుమతుల్లో ఏటా 6 శాతానికి పైగా వృద్ధి నమోదు చేస్తుంటే, మన దగ్గర వృద్ధిరేటు ఒక్క శాతం కూడా ఉండట్లేదు. వస్త్ర పరిశ్రమకు కేంద్రం ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదని వ్యాపారులు చెప్తున్నారు.
పాదరక్షల రంగంలో ప్రపంచ వాణిజ్య విస్తరణ 5 శాతం దాకా ఉన్నది. అయితే, భారత్లో ఇది ఒక్క శాతం కూడా మించట్లేదు.
కార్మిక శక్తి ఎక్కువగా ఉన్న రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోతే, నిరుద్యోగం మరింతగా పెచ్చరిల్లవచ్చు. అదే జరిగితే, ఆర్థిక వ్యవస్థే అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉంది.