న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ రక్షణ రంగ సంస్థ అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. భారత భద్రతా బలగాలు వినియోగించే క్షిపణులు, డ్రోన్లు, చిన్నతరహా ఆయుధాల తయారీలో వాడే విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని, వాటిపై దిగుమతి సుంకాలను చెల్లించకుండా అదానీ డిఫెన్స్ మోసపూరితంగా ఎగ్గొట్టినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే భారతీయ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) ఈ ఏడాది మార్చిలోనే దర్యాప్తు మొదలుపెట్టింది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. తప్పుడు వివరాలతో దాదాపు రూ.80 కోట్ల (9 మిలియన్ డాలర్లు) కస్టమ్స్ సుంకాలు, ఇతర పన్నులను అదానీ సంస్థ ఎగవేసినట్టు ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) అదానీ డిఫెన్స్ ఆదాయం 76 మిలియన్ డాలర్లలో ఇది 10 శాతం కంటే ఎక్కువ. అలాగే నాటి సంస్థ లాభంలో సగాని కంటే అధికం. నిజానికి ఇలాంటి కేసుల్లో ఎగవేసిన పన్ను మొత్తాలకు సమానంగా అదనపు జరిమానాలు విధిస్తారు. దీన్నిబట్టి అదానీ సుమారు రూ.160 కోట్లు (18 మిలియన్ డాలర్లు) చెల్లించాల్సి ఉంటుందన్నమాట. మరోవైపు అదానీ గ్రూప్ ఈ అంశంపై స్పందించింది. డీఆర్ఐ కొన్ని వివరణలను కోరిందని, వాటిని ఇచ్చామని తెలియజేసింది. అంతేగాక ఇది ముగిసిపోయిన వ్యవహారమని అదానీ అధికార ప్రతినిధి ఒకరు చెప్తుండగా, సెటిల్మెంట్కు కంపెనీ ఏవైనా చెల్లింపులు చేసిందా? లేదా? అన్నది మాత్రం చెప్పలేదు. అయితే దిగుమతుల సమయంలో సదరు విడిభాగాలను తప్పుగా పేర్కొన్నారని దర్యాప్తులో అదానీ కంపెనీ వర్గాలు చెప్పినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు అంటున్నారు. అలా పన్నులు చెల్లించకుండా తప్పించుకున్నారని చెప్తున్నారు. కానీ వాటిని ఏమిటని చూపించారన్న సమాచారం మాత్రం లేదు. అయితే షార్ట్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ విడిభాగాలను దిగుమతి చేసుకొని, లాంగ్-రేంజ్ మిస్సైల్స్ విడిభాగాలుగా కస్టమ్స్ అధికారులకు చూపినట్టు తెలుస్తోంది. వీటికి సుంకాల మినహాయింపున్నది. కానీ షార్ట్-రేంజ్ మిస్సైల్స్ విడిభాగాలకు 10 శాతం దిగుమతి సుంకం, 18 శాతం స్థానిక పన్ను వర్తిస్తుంది. వీటిని తప్పించుకోవాలనే తప్పుడు సమాచారాన్ని అదానీ కంపెనీ ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందని అధికార వర్గాల మాట.
ఇటీవలే అదానీ గ్రూప్‌నకు స్టాక్స్ అక్రమాలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ క్లీన్చిట్ ఇచ్చినది తెలిసిందే. అయినప్పటికీ ఇంకా డజనుకుపైగా నిబంధనల ఉల్లంఘన ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఎదుర్కొంటుండటం గమనార్హం. ఇక బొగ్గు దిగుమతుల ఇన్వాయిస్లకు సంబంధించి 2014 నుంచే అదానీ గ్రూప్‌పై డీఆర్ఐ దర్యాప్తు చేస్తున్నది. కానీ తాము ఏ తప్పూ చేయలేదని వాదిస్తున్న అదానీ.. కోర్టుల ద్వారా దర్యాప్తులను అడ్డుకుంటున్నారని రాయిటర్స్ ఎప్పట్నుంచో చెప్తున్నది. ఇక 2024 జనవరి నుంచి రష్యా, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాల నుంచి అదానీ గ్రూప్ సంస్థలు 70 మిలియన్ డాలర్లకుపైగా విలువైన రక్షణ విడిభాగాలను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలో అదానీ గ్రూప్ నెలకొల్పదలిచిన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వం పర్యావరణ నిబంధనల్లో మార్పులు చేయడానికి సిద్ధపడుతున్నది. అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్ కల్యాణ్ జిల్లాలో రూ.1,400 కోట్ల వ్యయంతో 26 హెక్టార్లలో పరిశ్రమను స్థాపించేందుకు ప్రతిపాదించింది. ముంబై మెట్రోపాలిటన్ నగర పరిధిలో ఉండే కల్యాణ్ జిల్లాలోని దాదాపు 11 గ్రామాల ప్రజలు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొన్న స్థానికులు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రదేశంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా ఏర్పాటుచేస్తారని, సదరు పరిశ్రమ వల్ల దుమ్ము, ధూళితోపాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి విషపూరిత వాయువులు వెలువడతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ గత నెల 26న ఓ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ‘కాప్టివ్ విద్యుత్తు ప్లాంట్ లేని సిమెంట్ గ్రైండింగ్ యూనిట్’కు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను 60 రోజుల్లో తెలియజేయాలని పేర్కొంది. కాగా ఈ నోటిఫికేషన్ విషయం తమకు ఇంతవరకు తెలియదని కల్యాణ్ సమీపంలోని కోలివాడ గ్రామ సర్పంచ్ సుభాష్ పాటిల్ చెప్పారు. నోటిఫికేషన్ తమకు అందిందని, దీనిపై 60 రోజుల్లో అభ్యంతరాలు లేదా సూచనలు చేయవచ్చని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి చెప్పారు. గడువు పూర్తయిన వెంటనే తుది నిర్ణయం వెలువడుతుందని అన్నారు.