న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వాహన విక్రయాలకు ఆగస్టు నెల అచ్చొచ్చింది. రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం తాజాగా వెల్లడించింది. గత నెలలో 24,23,201 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయని సియామ్ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన వాహనాలతో పోలిస్తే 17.51 శాతం చొప్పున పెరిగాయని తెలిపింది.
మందకొడి రుతుపవనాల కారణంగా వ్యాపార కార్యకలాపాలు మందగించినప్పటికీ, పండుగ సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ జీఎస్టీ 2.0 కల్పిస్తున్న ఆర్థిక ప్రయోజనాలతో వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయని సియామ్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ తెలిపారు. దేశీయ చరిత్రలో తొలిసారిగా ప్యాసింజర్ వాహన అమ్మకాలు(సీఎన్జీ+హైబ్రిడ్+ఈవీ) వాటా 41.95 శాతానికి చేరుకున్నాయని, అలాగే పెట్రోల్(40.85 శాతం) వాటా తగ్గిపోయాయి.
సంస్థాగత సంస్కరణలకు పెద్దపీట వేయడంతోపాటు చమురుకు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌తో నడిచే వాహనాలు అందుబాటులోకి రావడంతో వీటికి డిమాండ్ అధికంగా ఉందన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో వాహన కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలకు మొగ్గుచూపారు. దీంటో ఈవీలు, సీఎన్జీ, హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. వీటికి తోడు గతేడాది ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0తో వాహన ధరలు భారీగా పడిపోవడం కూడా ఆటోమొబైల్ సంస్థలకు కలిసొచ్చింది. పలు రాష్ర్టాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటుండటంతో భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానంగా ట్రాక్టర్ల అమ్మకాలు ఫ్లాట్‌గా నమోదవుతున్నప్పటికీ, ఈ ఏడాది చివరి నాటికి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.