న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: స్మార్ట్ఫోన్లు ఖరీదెక్కాయి. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లో దేశీయంగా మొబైల్ ఫోన్ల ధరలు 16 శాతం వరకు అధికమయ్యాయి. చిప్‌ల ధరలు భారీగా పెరగడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో మొబైల్ తయారీ సంస్థలు అమాంతం ధరలు పెంచాయని మార్కెట్ రీసర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. స్థానిక తయారీదారులకు దిగుమతి చేసుకున్న విడిభాగాల కోసం అదనంగా వెచ్చించాల్సి రావడంతో తమపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచాయని పేర్కొంది.
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశీయంగా సరాసరి స్మార్ట్ఫోన్ల ధరలు 16 శాతం వరకు అధికమయ్యాయని, వన్‌ప్లస్ మాత్రం సింగిల్ డిజిట్ మాత్రమే సవరించిందని, చిప్‌ల కోసం తయారీ సంస్థలు అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో సరాసరి స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో 318 డాలర్లకు చేరుకున్నదని తన నివేదికలో వెల్లడించింది.
స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరుగడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. కేవలం చైనాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ మాత్రం ధరలను కేవలం ఎనిమిది శాతం మేర పెంచడంతో వీటి అమ్మకాలు పుంజుకున్నాయని సర్వే వెల్లడించింది. చిప్‌ల ధరల పెరుగుదల కారణంగా రూ.10 వేల లోపు బడ్జెట్ ఫోన్లపై అధిక ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది. సగటున 32 శాతం వీటి ధరలు పెరిగాయని పేర్కొంది.
మొబైల్ తయారీలో దీని వాటానే అధికం కావడం ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో గతేడాదితో పోలిస్తే రూ.10 వేల లోపు స్మార్ట్ఫోన్ల విక్రయాలు 65 శాతం పడిపోయాయని తెలిపింది. అలాగే రూ.10-15 వేల లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు కేవలం 20 శాతానికి పరిమితమయ్యాయి. దేశీయంగా తయారవుతున్న మొబైల్ ఫోన్లలో 99 శాతం ఇక్కడే అమ్ముడవుతుండటం విశేషం. దేశీయంగా అమ్ముడవుతున్న రూ.20 వేల కంటే అధిక ధర కలిగిన స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో వన్‌ప్లస్ ముందు వరుసలో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.