Indian Economy | భారత్ 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 6.7 శాతంగా నమోదు అవుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ గురువారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జీడీపీ 8.2 శాతంగా ఉందని పేర్కొన్న ఎస్ అండ్ పీ గ్లోబల్.. ప్రస్తుత ఆర్థిక సంస్కరణలు కొనసాగించడం, లాజిస్టిక్, లావాదేవీల బిజినెస్ మెరుగు పర్చడం, ప్రభుత్వ పెట్టుబడులపై ఆధార పడటం తగ్గించడంతోపాటు ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం కీలకం అని పేర్కొంది.
మెరుగైన నియంత్రణ చట్టాలు- విధానాలు, ప్రభుత్వ బాండ్లలోకి విదేశీ పెట్టుబడుల రాక తదితర పరిణామాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో డైనమిక్‌గా నిలబడతాయని, తద్వారా భారత్ గ్రోత్ రేట్ మరింత పెరుగుతుందని ‘ఇండియా ఫార్వర్డ్- ఎమర్జింగ్ పర్స్పెక్టివ్స్’ అనే పేరుతో రూపొందించిన నివేదికలో ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది. వాణిజ్య ప్రయోజనాలు గరిష్టంగా పొందేందుకు భారత్ మౌలిక వసతులను తప్పనిసరిగా అభివృద్ధి చేయాలని, కోస్తా తీర ప్రాంతాలతోపాటు భౌగోళిక రాజకీయ వ్యూహాలను తప్పక అమలు చేయాలని ఆ నివేదిక వివరించింది. దాదాపు 90 శాతం భారత్ వాణిజ్య సముద్ర మార్గంలో సాగుతున్నందున నౌకాశ్రయాల్లో మౌలిక వసతులు వృద్ధి చేయాల్సి ఉందన్నది. తద్వారా సముద్ర మార్గంలో భారీగా ఎగుమతులతోపాటు దిగుమతులు చేయొచ్చునని తెలిపింది.
ప్రస్తుతం భారత్ లో ఇంధన డిమాండ్ పెరుగుతున్నది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు సంప్రదాయేతర ఇంధన వనరులు, సుస్థిర టెక్నాలజీల వైపు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉందని ఎస్ & పీ గ్లోబల్ నివేదిక పేర్కొంది. ఇంధన పరివర్తన ప్రణాళికలతో ఇంధన భద్రతలో సమతుల్యత తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. వ్యవసాయ రంగంలో అధునాతన టెక్నాలజీలు అందుబాటులోకి తేవడంతోపాటు మౌలిక వసతులు, ఉత్పాదక రంగాల మెరుగుదలకు నూతన విధానాలు రూపొందించాల్సి ఉందని తెలిపింది. ఆర్థిక సుస్థిరత, ఆహార భద్రత కోసం ఇరిగేషన్, స్టోరేజీ అండ్ సప్లయ్ డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో మౌలిక వసతులు మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని తెలిపింది. భారత్ ఆర్థిక వృద్ధిరేటుపై ఎస్ అండ్ పీ గ్లోబల్ గురువారం నివేదిక విడుదల చేసింది.