World Bank | న్యూఢిల్లీ, ఆగస్టు 2: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తి, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును సాధిస్తున్న దేశం అంటూ భారత్‌ను కీర్తిస్తున్న వేళ.. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదిక అందులో నిజమెంత? అన్న అనుమానాల్ని రేకెత్తిస్తున్నది. రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్‌సహా 100కుపైగా దేశాలు.. అధిక ఆదాయ దేశాలుగా ఎదిగేందుకు ఎన్నో తీవ్ర అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది.
ఈ క్రమంలోనే అమెరికా తలసరి ఆదాయంలో ఒక్క త్రైమాసికానికి సమానమైన ఆదాయాన్ని చేరాలన్నా.. భారత్‌కు దాదాపు 75 ఏండ్లు పట్టవచ్చని అంచనా వేసింది. ఇదిప్పుడు మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2024: ది మిడిల్ ఇన్కమ్ ట్రాప్ పేరిట తెచ్చిన రిపోర్టులో అమెరికా తలసరి ఆదాయంలో నాల్గోవంతును చేరడానికి చైనాకైతే 10 ఏండ్లు పడుతుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. ఇండోనేషియాకు 70 ఏండ్లు పట్టవచ్చన్నది.
గత ఏడాది చివరికల్లా భారత్‌సహా 108 దేశాలను మిడిల్ ఇన్కమ్ దేశాలుగా వర్గీకరించారు. ఒక్కోదాని వార్షిక జీడీపీ తలసరి ఆదాయం 1,136 డాలర్ల నుంచి 13,845 డాలర్ల మధ్య ఉన్నది. ఈ దేశాల్లో 600 కోట్ల జనాభా ఉండగా.. ఇది ప్రపంచ జనాభాలో 75 శాతానికి సమానం. అలాగే ఈ దేశాల్లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు కటిక దారిద్య్రంలో మగ్గిపోతుండటం గమనార్హం. ఇదిలావుంటే 1990 నుంచి ఇప్పటిదాకా కేవలం 34 దేశాలే మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థల నుంచి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థలకు ఎదిగాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రధాన ఆర్థికవేత్త గిల్ తెలిపారు.