Google-BCG | ఈ దశాబ్ది చివరికల్లా భారత్ మొబిలిటీ పరిశ్రమ రెట్టింపు అవుతుందని గూగుల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్త నివేదికలో తెలిపింది. 2030 నాటికి భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం 600 బిలియన్ డాలర్లు దాటుతుందని తెలిపింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో శనివారం గూగుల్, బీసీజీ కలిసి ఈ నివేదిక విడుదల చేశాయి. క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతున్నదని ఈ నివేదిక సారాంశం. ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సాఫిష్టికేటెడ్ ఎలక్ట్రిక్ కార్లకు ప్రాధాన్యం పెరుగుతున్నది. ఇక ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు దారులు కంఫర్టబుల్, అఫార్టబిలిటీ, ప్రాక్టికాలిటీపై దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు మహిళల్లో 50 శాతం మంది ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. 38 శాతం మంది ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని గూగుల్-బీసీజీ నివేదిక తెలిపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ, షేర్డ్ మొబిలిటీ, కనెక్టెడ్ మొబిలిటీ సంయుక్తంగా 100 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు.