యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతులపై భారత్ ఆంక్షల్ని తీసుకొచ్చింది. ముడి ఖనిజం, పౌడర్ రూపంలో ఉన్నా.. సెమీ-మాన్యుఫాక్చర్డ్గా ఉన్నా ఈ ఆంక్షలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద నామినేటెడ్ ఏజెన్సీలు, క్వాలిఫైడ్ జ్యుయెల్లర్స్, వ్యాలిడ్ టారిఫ్ రేట్ కోటా (టీఆర్క్యూ) ట్రేడర్స్ ద్వారానే సదరు దిగుమతులు దేశంలోకి జరుగనున్నాయి. కాగా, సీఈపీఏ ఒప్పందం కింద టీఆర్క్యూ సిస్టమ్ ద్వారా 1 శాతం టారిఫ్ రాయితీపై యూఏఈ నుంచి ఏటా 200 మెట్రిక్ టన్నులదాకా బంగారాన్ని దిగుమతి చేసుకొనేందుకు భారత్ అంగీకరించింది.
అయితే ప్రస్తుత నిబంధనల్లోని లోపాలను అడ్డం పెట్టుకొని కొందరు దిగుమతిదారులు బంగారం, వెండి, ప్లాటినమ్ దిగుమతుల్లో అక్రమాలకు పాల్పడుతుండటంతో త్వరలోనే ఆంక్షల్ని తేనున్నట్టు ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లోనే కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు వీటిని తీసుకొచ్చింది. మే 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) తెలిపింది.