Forex Reserve | భారతదేశ ఫారెక్స్ నిలువలు భారీగా పెరిగాయి. గతవారం ఫారెక్స్ నిల్వలు 15.267 బిలియన్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ డేటా పేర్కొంది. దాంతో దేశం మొత్తం విదేశీ మారక ద్రవ్య నిలువలు 653.966 బిలియన్లకు చేరాయి. గత మూడేళ్లలో ఒక వారంలో అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి. దాదాపు నాలుగు నెలలుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల 11 నెలల కనిష్ఠానికి చేరుకున్నది. ఆ తర్వాత హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. గత సంవత్సరం సెప్టెంబర్ మొదటల్లో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 704.89 బిలియన్ డాలర్లకు చేరాయి. అప్పటి నుంచి ఫారెక్స్ నిలువలు వరుసగా తగ్గుతూ వచ్చాయి.
ప్రస్తుతం గరిష్ఠ స్థాయితో పోలిస్తే 7శాతం తక్కువగా ఉన్నాయి. రూపాయి పతనం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ జోక్యం వల్లే విదేశీ మారక ద్రవ్యం నిలువలు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు. యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇప్పుడు ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అతిపెద్ద భాగమైన.. భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA) 557.282 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ డేటా పేర్కొంది. ఈ డేటా ప్రకారం.. ప్రస్తుతం బంగారు నిల్వలు 74.325 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిలువలు దాదాపు 10 నుంచి 11 నెలల అంచనా వేసిన దిగుమతులకు సరిపోతాయని అంచనా. 2023లో భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వులకు దాదాపు 58 బిలియన్లు పెంచగా.. 2022లో 71 బిలియన్లు తగ్గాయి. 2024లో 20 బిలియన్లకుపైగా పెరిగాయి.