హైదరాబాద్, జనవరి 28: రెండేండ్లకొకసారి హైదరాబాద్‌లో జరిగే విమానాల పండుగ అంగరంగవైభవంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్..కమర్షియల్ మార్కెట్ అవుట్‌లుక్(సీఎంవో)ను విడుదల చేసింది. 2044 నాటికి భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో 3,300 విమానాలకు డిమాండ్ ఉంటుందని పేర్కొంది. భారత్‌లో విమానాలకు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నదని, గడిచిన దశాబ్ద కాలంలో విమానాల సర్వీసుల సంఖ్య ఐదింతలు పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. వీటిలో సింగిల్ జెట్ లేదా తక్కువ స్థాయి బాడీ కలిగిన విమానాల వాటా 90 శాతంగా లేదా 2,875గా ఉంటుందని పేర్కొంది.
అలాగే 2044 నాటికి 45 వేల మంది పైలెట్లు, 45 వేల మంది టెక్నిషన్లు, 51 వేల మంది క్యాబిన్ క్రూలు అవసరమవుతారని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ నాయుడు తెలిపారు. వచ్చే 20 ఏండ్లలో భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో విమాన ప్రయాణికుల్లో వృద్ధి వార్షికంగా 7 శాతం పెరుగుదల నమోదు చేసుకోనున్నదన్నారు. అలాగే విమానయాన సేవలు, నిర్వహణ, మరమ్మతులు, మాడిఫికేషన్, డిజిటల్ సర్వీసులు, శిక్షణ కోసం 195 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని ఆయన చెప్పారు. దేశీయ విమానయాన రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో విమానయాన సంస్థలు 1,500కి పైగా విమాన సర్వీసులకోసం ఆర్డర్లు ఇచ్చాయని, దీంతో దీని అనుబంధ రంగాలు కూడా పుంజుకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
హెచ్ఏఎల్ ఎస్జే100 ఎయిర్‌క్రాఫ్ట్
వచ్చే మూడేండ్లకాలంలో సూపర్‌జెట్ 100(ఎస్జే 100) ఎయిర్‌క్రాఫ్ట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్ తెలిపారు. వచ్చే పదేండ్లకాలంలో మొత్తం ఆదాయంలో సివిల్ ఏవియేషన్ నుంచి 25 శాతం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగా ప్రణాళికను వేగవంతం చేసింది. దీంట్లో భాగంగానే ప్రతియేటా రూ.3 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.31 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు, ఈసారి 7-8 శాతం వృద్ధిని అంచనావేస్తున్నట్టు చెప్పారు.
వింగ్స్ ఇండియా ముఖ్య అంశాలు