న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: పెట్టుబడుల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం అలంకార సాధనంగా ఉన్న బంగారం.. ఇప్పుడు మదుపునకు చక్కని మార్గంగా అవతరించింది మరి. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం పసిడి కొనుగోలుదారుల ఆలోచనా సరళి మారింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారతీయ గోల్డ్ మార్కెట్ ఓ నిర్మాణాత్మక మార్పును సంతరించుకున్నదని డబ్ల్యూజీసీ నివేదిక చెప్తున్నది. దేశీయంగా తొలిసారి నగల కొనుగోళ్లను మించి పెట్టుబడి డిమాండ్ నమోదైనట్టు తేలింది.
ఇదీ సంగతి..
బంగారు నాణేలు, కడ్డీలతోపాటు గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)కు గిరాకీ పెరిగిందని డబ్ల్యూజీసీ తెలిపింది. ఇదే సమయంలో సంప్రదాయ ఆభరణాల కొనుగోళ్లు క్షీణించాయని పేర్కొన్నది. అధిక ధరలే ఇందుకు కారణమన్నది. 2025 ఆరంభంలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి 10 గ్రాముల రేటు రూ.78,950గా ఉన్నది. ప్రస్తుతం రూ.1,52, 800గా ఉన్నది. దాదాపుగా రెట్టింపైంది. ఇక ఈ ఏడాది జనవరి 29న ఆల్‌టైమ్ హైని తాకుతూ ఏకంగా రూ.1,83,000 పలికిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే బంగారాన్ని నగల రూపంలో కొనడం కంటే పెట్టుబడిగా మల్చితే లాభదాయకం అన్న భావన మదుపర్లలో సర్వత్రా నెలకొన్నది. ఇక బంగారంపై పెట్టుబడి డిమాండ్ గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో 54 శాతం ఎగిసి 82 టన్నులకు చేరినట్టు డబ్ల్యూజీసి చెప్పింది. ఇదే సమయంలో నగల కొనుగోళ్లు 19.5 శాతం పడిపోయి 66 టన్నుల (రూ.99,900 కోట్లు)కు పరిమితమైనట్టు వెల్లడించింది. అలాగే మొత్తం పసిడి వినియోగంలో 54.3 శాతం వాటా పెట్టుబడులదేనని పేర్కొన్నది. కాగా, దేశంలో గోల్డ్ డిమాండ్ నిరుడుతో చూస్తే 10.2 శాతం పుంజుకొని 151 టన్నులకు చేరినట్టు వివరించింది. 2025లో 137 టన్నులే. ఈసారి గోల్డ్ డిమాండ్ విలువపరంగా రూ.2,27,500 కోట్లుగా ఉన్నది.
అంతర్జాతీయంగా..
గ్లోబల్ గోల్డ్ డిమాండ్ ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 2 శాతం పెరిగి 1,231 టన్నులుగా నమోదైంది. బంగారు కడ్డీలు, నాణేల కొనుగోళ్లు జోరుగా సాగడమే కారణం. గతంతో చూస్తే 42 శాతం ఎగబాకి 474 టన్నులుగా ఉన్నాయి. ఇక ఏడాది కాలంలో బంగారం సగటు ధర ఔన్స్‌కు 2,860 డాలర్ల నుంచి 4,873 డాలర్లకు ఎగిసింది. కాగా, జ్యుయెల్లరీ డిమాండ్ 23 శాతం క్షీణించి 300 టన్నులకు దిగజారింది. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి నిల్వలను ఈ 3 నెలల్లో మరో 244 టన్నులు పెంచుకున్నట్టు డబ్ల్యూజీసీ చెప్తున్నది.
పెరిగే ధరలు బంగారు ఆభరణాలకు భారతీయ మార్కెట్లో మరింతగా డిమాండ్‌ను తగ్గించవచ్చు. అయితే ఈ పెండ్లిళ్ల సీజన్, రాబోయే పండుగలు కొంతమేర నగల కొనుగోళ్లకు ఆసరాగా నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఇక పసిడిపై పెట్టుబడులు కొనసాగుతాయనే చెప్పాలి. మార్కెట్ ఒడుదుడుకుల దృష్ట్యా మదుపర్లు తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత వేదికని భావిస్తున్నారు.
-సచిన్ జైన్, డబ్ల్యూజీసీ ఇండియా సీఈవో