హైదరాబాద్, అక్టోబర్ 1: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన ప్రయాణం మరింత భారం కానుంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎమ్మార్ యూజర్ చార్జీల్ని క్రమేపీ పెంచుకునేందుకు ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతించింది. దీంతో 2022 ఏప్రిల్ 1 నుంచి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు అధిక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏఈఆర్ఏ జారీచేసిన ఉత్తర్వుల వివరాలివి…
2022 ఏప్రిల్ 1 నుంచి దేశీయ ప్రయాణీకుల యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) ప్రస్తుత రూ.281 నుంచి రూ.480కి పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రయాణీకులకు ఈ ఫీజు రూ.393 నుంచి రూ.700కు చేరుతుంది.
క్రమేపీ పెంచుతూ 2025 డిసెంబర్ 31నాటికి దేశీయ ప్రయాణీకుల నుంచి రూ.750, అంతర్జాతీయ ప్రయాణీకుల నుంచి 1,500 యూడీఎఫ్‌ను వసూలు చేస్తారు.
యూజర్ చార్జీలకు సంబంధించి మూడో కంట్రోల్ పీరియడ్ (2022 ఏప్రిల్-2026 మార్చి) చివరి మూడు నెలల్లో…. అంటే 2026 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ మాత్రం దేశీయ ప్రయాణీకుల ఫీజును రూ.500కు, అంతర్జాతీయ ప్రయాణీకుల ఫీజును రూ.1,000కి తగ్గిస్తారు.
మెట్రో కనెక్టివిటీ వ్యయానికి అనుమతి నిరాకరణ…
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మెట్రో కనెక్టివిటీ కోసం రూ.519 కోట్లు వ్యయం చేయనున్నట్లు జీఎమ్మార్ సమర్పించిన ప్రతిపాదనను ఏఈఆర్ఏ అనుమతించలేదు. ఈ మూలధన వ్యయానికి సంబంధించి తగిన వివరాలు లేనందున, మూడో కంట్రోల్ పీరియడ్‌లో ఈ పెట్టుబడిని అనుమతించకూడదని అథారిటీ నిర్ణయించింది. విమానాశ్రయం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్ని కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.5,000 కోట్ల మెట్రో రైల్ లింక్ ప్రాజెక్టులో రూ.500 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్లు ఇటీవల జీఎంఆర్ గ్రూప్ ప్రకటించిన విషయం తెలిసిందే.