న్యూఢిల్లీ, జనవరి 11: గతేడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు కోసం కార్పొరేట్లకున్న గడువును ఈ ఏడాది మార్చి 15 వరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం పొడిగించింది. కార్పొరేట్లకు ఇలా వెసులుబాటు ఇవ్వడం ఇది మూడోసారి. అసలు గడువు నిరుడు అక్టోబర్ 31తోనే ముగిసింది. అయినా పెంచారు. ఇప్పుడు మళ్లీ పొడిగించారు. ఇక ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు దాఖలుకున్న గడువును, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్ రిపోర్టు గడువును వచ్చే నెల 15దాకా పొడిగించారు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లావాదేవీలతో ఉన్నవారి గడువు నవంబర్ 30నే తీరిపోయింది. కాగా, కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యానే ఈ గడువులను పెంచుతున్నట్టు సీబీడీటీ ఓ ప్రకటనలో తెలియజేసింది. వేతన జీవులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా నాన్-ఆడిటబుల్, నాన్-కార్పొరేట్ వ్యాపారులకు ఎలాంటి ఊరట ఇవ్వలేదు.