ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ మళ్లీ వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నుల దాఖలుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాత, కొత్త పన్ను విధానాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే కొందరు పన్ను చెల్లింపుదారుల్లో ఏ విధానం ఉత్తమమన్నదానిపై అయోమయం ఉంటూనే ఉన్నది. అలాంటివారికి ఆర్థిక నిపుణులు కొన్ని సంకేతాలిస్తున్నారు.
మీరు పెట్టిన పెట్టుబడులపై ఐటీ మినహాయింపుల్ని కోరుకుంటే పాత పన్ను విధానాన్నే ఎంచుకోవాలి. కానీ సెక్షన్ 80సీ, 80డీ, 80డీడీ, 80జీ వంటి పన్ను ఆదా పెట్టుబడులను పెట్టకపోతే కొత్త పన్ను విధానమే ఉత్తమం. సెక్షన్ 80సీసీడీ (2), 80సీసీహెచ్, 80జేజేఏఏ కింద కొత్త పన్ను విధానంలోనూ పన్ను మినహాయింపుల్ని పొందవచ్చు.
వేతన జీవులు పెద్ద ఎత్తున హెచ్ఆర్ఏ మినహాయింపులను ఆశిస్తే పాత పన్ను విధానంలోనే సాధ్యం. సెక్షన్ 10(13ఏ) కింద ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కానీ ఇది కొత్త పన్ను విధానంలో ఉండదు.
సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కోసం రుణం తీసుకుంటే దానికి సంబంధించి చెల్లించే వడ్డీలపై పన్ను మినహాయింపును కోరుకుంటే పాత పన్ను విధానంలో ప్రయత్నించవచ్చు. ఇందుకు ఐటీఆర్ 1,2లలో ‘yes’ను ఎంచుకోవాలి. ఐటీఆర్ 3,4,5లలో ‘Yes, within due date’ optionను తీసుకోవాలి.
వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ 1,2 ఫారాల్లో తమ ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేస్తే ఫారం 10-ఐఈఏను సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఐటీఆర్ 3,4,5 ఫారాల్లో తమ ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసే వ్యక్తిగత ఐటీ పేయర్స్ మాత్రం తమకు వ్యాపార ఆదాయం ఉన్నైట్టెతే ఫారం 10-ఐఈఏను సమర్పించాలి.