న్యూఢిల్లీ, ఆగస్టు 11 : 63 ఏండ్ల కిందటి పాత ఆదాయ పన్ను (ఐటీ) చట్టం స్థానంలో తెచ్చిన కొత్త ఐటీ చట్టం కేవలం 3 నిమిషాల్లోనే లోక్సభ ఆమోదం పొందింది. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వ్యక్తులు, సంస్థల ఆదాయ పన్ను నిర్మాణానికి సంబంధించి ప్రవేశపెట్టిన ఈ కీలక చట్ట సవరణలు ఎటువంటి చర్చ లేకుండానే పాసైపోవడం గమనార్హం.
ఆదాయ పన్ను చట్టం-1961 స్థానంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఐటీ బిల్లు (నెం.2) 2025ను లోక్సభకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపారు. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యులుగల కమిటీ.. ఇందులో మార్పులు చేస్తూ పలు సిఫార్సులను సూచించింది. ఈ క్రమంలోనే సదరు సిఫార్సులను బిల్లులో పొందుపర్చడానికి ఈ నెల 8న లోక్సభ నుంచి దాన్ని సీతారామన్ ఉపసంహరించిన సంగతి విదితమే. సోమవారం సభకు తీసుకొస్తామని అప్పుడే (గత శుక్రవారం) చెప్పగా, అందుకు తగ్గట్టే వచ్చిన బిల్లు.. కేవలం 3 నిమిషాల్లోనే ఆమోదం పొందడం గమనార్హం. ఓవైపు బీహార్ ఓటర్ల జాబితాకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (ఎస్ఐఆర్)లో అక్రమాల ఆరోపణలపై ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుంటే.. మరోవైపు ఐటీ చట్టం సవరణల బిల్లును ప్రవేశపెట్టి, వాయిస్ ఓట్ ద్వారా మోదీ సర్కారు ఆమోద ముద్ర వేయించింది. దీంతో ఇక ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లనున్నది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సమ్మతికి పోనున్నది. గ్రీన్ సిగ్నల్ వస్తే చట్టంగా అమల్లోకి రానున్నది. కాగా, ఆదాయ పన్ను (నెం.2) బిల్లుతోపాటు పన్ను చట్టాల (సవరణ) బిల్లుకూ ఒకేసారి ఆమోదం లభించింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీం సబ్స్ర్కైబర్స్కు పన్ను మినహాయింపులను కల్పించేదే ఈ బిల్లు.