ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపిస్తున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో మనకొచ్చే ముడి చమురు, గ్యాస్ సరఫరా.. తీవ్రంగానే ఇబ్బందుల్లో పడింది మరి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత..
రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుండగా, అన్ని వస్తూత్పత్తుల ధరలు క్రమేణా ఎగబాకుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి పెరిగితే.. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 2.13 శాతానికి చేరింది. ఈ క్రమంలో జీవనశైలి ద్రవ్యోల్బణం కూడా మితిమీరితే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. తమ వాస్తవిక ఆదాయ స్థితిగతులను చూసుకోకుండా విలాసవంతమైన జీవితం కోసం పాకులాడటమే జీవనశైలి ద్రవ్యోల్బణం. మీ వేతనం, దానిపై ఏటా వచ్చే బోనస్‌లు, ఇంక్రిమెంట్లను మించి.. మీ జీవన వ్యయాన్ని పెంచుకుంటూపోతుండటమే జీవనశైలి ద్రవ్యోల్బణం అనవచ్చు. ఉదాహరణకు.. మీ నెల జీతం లక్ష రూపాయలు.
ఈ సమయంలో 10 శాతం ఇంక్రిమెంట్ వచ్చింది. అప్పుడు మీ వేతనం రూ.1.10 లక్షలకు చేరుతుంది. అయితే సాలరీ పెరిగిందన్న ఉత్సాహంతో ఇప్పుడున్న కారు చాలదని, లోన్‌తో ఇంకాస్త లగ్జరీ కారును కొనాలనుకోవడం.. విదేశాలకు విహారయాత్రలు చేయాలనుకోవడం.. మరింత అద్దె చెల్లించైనా పెద్ద ఇంట్లోకి వెళ్లాలనుకోవడం.. వంటి ఆలోచనలు చేస్తే జీవనశైలి ద్రవ్యోల్బణం బారిన పడుతున్నట్టే. మీ జీతంలో పెరిగిన రూ.10 వేల ఆదాయం కంటే.. మీ ఆలోచనల వల్ల ఎక్కువ అప్పులపాలయ్యే ప్రమాదం ఉన్నది.
సంపాదన కంటే ఖర్చులు ఎక్కువైతే మీరు అప్పుల ఊబిలోకి జారుకోవడం చాలా సులభం. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి’ వంటి వాటికి అలవాటుపడితే ఆర్థిక సంక్షోభం తప్పదు. ప్రతీది క్రెడిట్ కార్డ్ ద్వారానే కొనడం, ఆపై వచ్చిన బిల్లులను నెలనెలా కనీస మొత్తాలతో సర్దుబాటు చేయడం.. మిమ్మల్ని పీకల్లోతు అప్పుల్లో ముంచేస్తాయి.
ఎడాపెడా చేసే ఖర్చులు.. మిమ్మల్ని మీ లక్ష్యాల సాధనలో విఫలమయ్యేలా చేస్తాయి. పిల్లల చదువు, సొంతిల్లు కోసం చేసే సేవింగ్స్‌కు గండి కొడుతాయి. మీ స్నేహితులు, బంధువులు, సహచర ఉద్యోగులు మీ కంటే విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నారని, మీ స్థోమతకు మించి చేసే అప్పులు.. మిమ్మల్ని రోడ్డునపడేస్తాయి.
దేశానికైనా, ఇంటికైనా.. బడ్జెట్ ఎంతో ముఖ్యమైనది. అయితే ముందుచూపు లేకుండా మీ కోరికల కోసం పెట్టే ఖర్చులు.. మీ బడ్జెట్‌ను తలకిందులు చేయగలవు. అవసరాలను వాయిదా వేస్తూ.. అనవసర ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తే ఇల్లు గుల్లే.
జీవన ప్రమాణాలు పెరుగాలనుకోవడం మంచిదే. విలాసవంతమైన జీవితాన్ని ఆశించడం కూడా తప్పు కాదు. అయితే మన ఆలోచనలు.. నింగికి నిచ్చెన వేసినట్టుగా ఉండకూడదు. అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యతనిస్తూ.. పొదుపునకు పెద్దపీటవేస్తే లక్ష్యాలను చేరుకోవడం కష్టమేమీ కాదు. ఇక మీ ఆదాయంలో అప్పులకు చెల్లించేది ఎట్టిపరిస్థితుల్లో 40-50 శాతాన్ని మించకుండా చూసుకోవడం ఉత్తమం. పిలిచి రుణాలు ఇస్తున్నారు కదా అని అప్పులు తీసుకున్నా.. అవసరం లేకపోయినా వాహనాలు, వస్తువులను అప్‌గ్రేడ్ చేసినా అవి.. లేనిపోని ఇబ్బందుల్నే తెచ్చిపెడుతాయని మరువద్దు. లెక్కకు మించిన క్రెడిట్ కార్డులను తీసుకోకండి. మున్ముందు జాబ్ మార్కెట్ ఇంకా ఒడిదుడుకులకు లోనయ్యే వీలున్నది. అందుకే మెరుగైన జీవిత-ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ ఫండ్లకు పెద్దపీట వేయండి. తెలివైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వండి. కనీసం మీ 6 నెలల అవసరాలకు సరిపడా ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి.