న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు నిలబడాలంటే భారత్ తమ సర్వ శక్తులనూ ఒడ్డాల్సిందేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నొక్కి చెప్పడం గమనార్హం. దేశీయ డిమాండ్, సంస్కరణలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, వాణిజ్య సంబంధాల బలోపేతంపై దృష్టిపెట్టి.. ఆ లక్ష్యాల సాధనకు శ్రమించాల్సిన అవసరం ఉందని గురువారం ఐఎంఎఫ్ ఆసియా-పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో ఇటీవలి సంస్కరణలు.. దేశీయంగా కొనుగోలు సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడగలవని చెప్తూనే.. మరిన్ని చర్యలు విస్తృత స్థాయిలో తీసుకుంటేనే ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో భారత్ నిలదొక్కుకోగలదని వ్యాఖ్యానించారు.