వాషింగ్టన్, ఏప్రిల్ 11: ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ అంచనాను మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తగ్గించింది. 5.9 శాతానికి పరిమితం చేసింది. ఇంతకుముందు ఇది 6.1 శాతంగా ఉన్నది. తమ తాజా వార్షిక ప్రపంచ ఎకనామిక్ ఔట్లుక్లో వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) వృద్ధిరేటు అంచనాను కూడా కుదించింది. 6.8 శాతం నుంచి 6.3 శాతానికి తీసుకొచ్చింది. కేవలం మూడు నెలల్లో అర శాతం అంచనా తగ్గడం గమనార్హం. దీంతో ఐఎంఎఫ్ అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థ చుట్టూ అలుముకుంటున్న ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. కాగా, 2022-23లోనూ భారత జీడీపీ 6.8 శాతంగానే ఉండొచ్చని ఈ సందర్భంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ అంచనా 7 శాతం కంటే ఇది తక్కువే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తున్నది తెలిసిందే. మరోవైపు చైనా వృద్ధిరేటు ఈ ఏడాది 5.2 శాతంగా, వచ్చే ఏడాది 4.5 శాతంగా నమోదు కావచ్చని ఐఎంఎఫ్ అంటున్నది. ఈ క్రమంలోనే ప్రపంచ జీడీపీ ఈ ఏడాది 2.8 శాతంగా, వచ్చే ఏడాది 3 శాతంగా ఉంటుందని పేర్కొన్నది. ద్రవ్యోల్బణం తగ్గే వీలున్నా.. జీడీపీ వృద్ధిరేటు మాత్రం మరింత మందగించవచ్చన్న అభిప్రాయాన్నే ఐఎంఎఫ్ తమ ఔట్లుక్లో వెలిబుచ్చింది.