Randhir Jaiswal : రష్యాతో ఇంధన ఒప్పందంపై అభ్యంతరాలు తెలుపుతూ నాటో చీఫ్ మార్క్ రుట్టే (Marc Rutte) చేసిన వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలపై వంద శాతం సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడాన్ని భారత విదేశాంగ మీడియా ప్రతినిధి రణ్‌ధిర్ జైస్వాల్ ( Randhir Jaiswal) తప్పుబట్టారు. ద్వంద్వ ప్రమాణాలను పాటించడం సరికాదని గురువారం పశ్చిమా దేశాలను జైస్వాల్ హెచ్చరించారు.
‘నాటో చీఫ్ వ్యాఖ్యలను.. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను నిశితంగా గమినిస్తున్నాం. అయితే.. నేను మరోసారి చెబుతున్నా మా దేశ ప్రజల ఇంధన అవసరాలే మాకు తొలి ప్రధాన్యం. అందుకని ప్రపంచ పరిస్థితులను బట్టి మార్కెట్లో అందుబాటులో ఉన్న వనరులను ఎంచుకుంటాం. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని హెచ్చరిస్తున్నాం’ అని జైస్వాల్ తెలిపారు.
ఉక్రెయిన్‌తో రష్యా శాంతి చర్చలకు సిద్దం కాకుంటే ఆ దేశ ప్రధాన వ్యాపార భాగస్వాములైన భారత్, బ్రెజిల్ చైనాలపై ట్రేడ్ టారిఫ్స్ తప్పవని నాటో చీఫ్ మార్క్ రుట్టే హెచ్చరించారు. అమెరికా సెనేటర్లతో సమావేశమైన తర్వాత ఆయన ఆంక్షల ప్రకటన చేయడం గమనార్హం. జూలై తొలి వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సైతం రష్యాతో ఆయిల్ ఒప్పందం చేసుకునే దేశాలపై వంద శాతం సెకండరీ టారిఫ్ భారం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌తో 50 రోజుల్లో శాంతి ఒప్పందం చేసుకోకుంటే తమ ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందని ట్రంప్ మాస్కోకు అల్టిమేటం జారీ చేశారు.