న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: స్వీడన్‌కు చెందిన గృహోపకరణాల విక్రయ సంస్థ ఐకియా..తన వ్యాపార పంథాను మార్చుకుంటున్నది. ఇప్పటికే మెట్రో నగరాలకు పరిమితమైన సంస్థ..తాజాగా చిన్న నగరాలకు విస్తరించాలని నిర్ణయించింది. మరింత మంది కస్టమర్లకు చేరువకావాలనే ఉద్దేశంతో చిన్న స్థాయి స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఐకియా ఇండియా కంట్రీ మేనేజర్ పూజా గ్రోవర్ తెలిపారు.
10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్లను నెలకొల్పాలనుకుంటున్నట్టు, ఈ స్టోర్లలో 7 వేలకు పైగా వస్తువులను విక్రయించనున్నట్టు చెప్పారు. హోమ్ డెలివరీ సేవలతోపాటు కలెక్షన్ పాయింట్ల వద్ద పికప్ లేదా థర్డ్ పార్టీ పికప్ ద్వారా కస్టమర్లు బుకింగ్ చేసుకున్న వస్తువులను వారి ఇంటికి సరఫరా చేయనున్నట్టు ప్రకటించారు. చిన్న స్టోర్లతోపాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై, పుణెలలో ఏర్పాటు చేసిన అతిపెద్ద స్టోర్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నది.