హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమే అని ఐఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ (Ramesh Loganathan) స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ఉద్యోగస్తులు కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా అప్డేట్ కావాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని మొత్తం 10 లక్షల మంది ఐటీ ఉద్యోగుల్లో 20-30 వేల మంది మాత్రమే ఏఐని ఉపయోగించి పనిచేస్తున్నారని తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యపై ఏఐ ఎలాంటి ప్రభావం చూపదని.. సివిల్, మెకానికల్ ఇంజినీర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయినట్టే ఇంజినీరింగ్‌లో ఏ కోర్సు చేసినా దర్జాగా ఏఐ ఉద్యోగాలు పొందవచ్చని చెప్పారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో పట్టభద్రుల అవసరం ఉన్నదని, నిర్మాణ, తయారీ రంగాల్లో సివిల్, మెకానికల్ ఇంజినీర్లు దొరకని ఆందోళనకర పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సేవలు విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఐటీ రంగంతోపాటు ఇంజినీరింగ్ విద్యపై ఏఐ ఏ మేరకు ప్రభావం చూపనుందనే అంశంపై ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రమేశ్ లోగనాథన్: కృత్రిమ మేధతో ఐటీ రంగానికి తక్షణ నష్టమేమీ ఉండదు. దాని వల్ల మనకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని 2016, 2020లో సైతం వార్తలు వచ్చాయి. గత రెండేండ్ల ఆ వదంతులు ఎక్కువయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు మనకు అనుకూలంగా మారేందుకు కాస్త సమయం పడుతుంది. కొన్ని విభాగాల్లో మాత్రమే అవకాశాలు తగ్గి మరికొన్నింటిలో పెరుగుతాయి. చాట్ జీపీటీ వల్ల జాబ్స్ పోతాయని గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఎక్కడా అలా జరగలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులుండగా, వీరిలో 6 లక్షల మంది ఐటీ డెవలపర్లు ఉన్నారు.
రమేశ్ లోగనాథన్: ఉదాహరణకు బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకుంటే ఆ రంగంలో ఓ సిస్టమ్‌ను డెవలప్ చేసి దాన్ని వినియోగించేందుకు కనీసం వెయ్యి మంది ఉద్యోగులు అవసరమవుతారు. వారు చేసే పని అస్సలు మారదు. అక్కడక్కడా ఏఐ సేవలను మాత్రం వినియోగించుకుంటారు. ఓ 20-30 మంది చేసే పనులను ఏఐతో చేయిస్తారు. ఏఐ కారణంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే పద్ధతితోపాటు ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆ సిస్టమ్‌ను ఇప్పటికే 30-40 ఏండ్ల నుంచి వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐని వినియోగించి ఆన్లైన్ మోసాలను గుర్తించే అవకాశం ఉన్నది. అందుకోసం కొంత మంది ఏఐ నిపుణులు పనిచేస్తారు. అదనపు పనులకే ఏఐని వినియోగిస్తారు తప్పా ముందు నుంచి ఉన్న పనిలో, సిస్టమ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చినా మనం చేసే పనుల్లో 90-95 శాతం మేరకు ఎలాంటి మార్పు ఉండదు. ఏఐ వల్ల ఐటీ రంగంలో ఉద్యోగాలు పెరగలేదు. అలా అని తగ్గనూలేదు. గత 3-4 ఏండ్ల నుంచి ఏం జరుగుతున్నదో ఈ ఏడాది కూడా అదే జరుగుతున్నది. నమస్తే తెలంగాణ: కోడింగ్ పనుల కోసం బడా ఐటీ కంపెనీలతోపాటు స్టార్టప్‌లు సైతం ఏఐని.
రమేశ్ లోగనాథన్: ఈ పరిణామం కొత్తదేమీ కాదు. గత 5-10 ఏండ్ల నుంచి పనిచేస్తున్న నిష్ణాతులైన డెవలపర్లకు మంచి రిసోర్స్‌లు ఉన్నాయి. ‘స్టాక్ ఓవర్ ఫ్లో’ సైట్ మనకు చాలా రోజుల నుంచి అందుబాటులో ఉన్నది. అందులోకి వెళ్లి ఫలానా సాఫ్ట్వేర్ తయారీకి కోడ్ కావాలి అని సెర్చ్ చేస్తే అది కోడ్‌ను మనకు చూపిస్తుంది. ముందు నాలుగైదు వేర్వేరు ప్రోగ్రామ్‌లను తీసుకుని కోడ్లను చూసి మనం రాయాల్సి ఉండేది. ఇప్పుడు ఏఐ కారణంగా ఆ సమయం ఆదా అవుతుంది. అయితే ముందు నుంచే మనకు శాంపిల్ కోడ్ అందుబాటులో ఉన్నది. వంద మంది డెవలపర్లు చేసే మొత్తం పనిని ఏఐతో పూర్తిచేసే టెక్నాలజీ ఇంకా రాలేదు. అయితే ఒక డెవలపర్ చేసే పనిలో ఏఐ టూల్ ఓ రిసోర్స్‌గా ఉంటుంది. ఏఐ వచ్చిన తర్వాత టెక్నాలజీ మెరుగుపడింది. 25-30 ఏండ్ల క్రితం సాఫ్ట్వేర్ కోడ్ మొత్తాన్ని డెవలపర్లే రాసేవారు. 15 ఏండ్ల క్రితం కోడ్‌ను రాసేటప్పుడు ఎంఎస్ వర్డ్‌లో సెంటెన్స్ కరెక్షన్ ఆప్షన్ వచ్చినట్టే కోడ్ కరెక్షన్ ఆప్షన్ వచ్చింది. 10 ఏండ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు కోడింగ్ మరింత సులుభమైంది. ప్రస్తుతం కోడ్‌ను రాయడంలో ఏఐ సహాయపడుతున్నది. ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీతో పోలిస్తే ఏఐ మెరుగైనదే అయినప్పటికీ దాన్ని మనం సాధనంలానే వినియోగించుకోవాల్సి ఉంటుంది.
రమేశ్ లోగనాథన్: కాలేజీల్లో నాలుగు రకాల ఏఐ కోర్సులు అందుబాటులో ఉన్నా యి. వాటిలో 90-95 శాతం కోర్సులు ఒకేలా ఉంటాయి. సర్టిఫికెట్లో డిగ్రీ మాత్రమే వేరుగా ఉంటుంది. వారంతా చదివేది కంప్యూటర్ సైన్సే. ఏ కోర్సు చేసినా ఇబ్బందేమీ ఉండ దు. ప్రస్తుతం మనకు ఏఐపై మంచి పట్టున్న లెక్చరర్లు అందుబాటులో లేరు. దీంతో కంప్యూటర్ సైన్స్ పాఠ్యప్రణాళికలో 5 శాతం మార్పు చేసి ఏఐ విద్యను బోధిస్తున్నారు.
రమేశ్ లోగనాథన్: ఏఐ కారణంగా ఓ ఐదేండ్లలో ఇంజినీర్ల అవసరం తగ్గుతుందనుకుంటే ఈ ఏడాది ఇంజినీరింగ్ చదివే వాళ్ల సంఖ్య తగ్గాలి కదా? అలా జరగలేదంటే దాని ప్రభావం లేదనే అర్థం. భవిష్యత్తులో ఇంజినీర్ల అవసరం తగ్గుతుందని కొందరు వాదిస్తున్నప్పటికీ అందుకు సరైన ఆధారాలేమీ లేవు. నిపుణులు అభిప్రాయపడినట్టు టెక్నాలజీ ఆ రేంజ్లో ఏమీ లేదు. గతంలో చాట్ జీపీటీ గురించి ఇలాంటి వాదనలు తెరపైకి వచ్చాయి. మనం చేసే రిసెర్చ్‌లో మాత్రమే ఇలాంటి టూల్స్ ఉపయోగపడతాయి. గతంలో మనం గూగుల్‌లో సమాచారాన్ని తెలుసుకునే వాళ్లం. ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి వాటితో సమయం ఆదా అవుతుందేమో కానీ మనం చేయాల్సిన పని ఏమాత్రం తగ్గదు. కొన్ని విభాగాల్లో ఈ టూల్స్ ఉపయోగపడతాయే తప్ప మొత్తం పనిని అవే చేయలేవు.
రమేశ్ లోగనాథన్: ప్రస్తుతం నిర్మాణ, తయారీ రంగాల్లోని కంపెనీలకు సివిల్, మెకానికల్ ఇంజినీర్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. అక్కడ పనిచేసే ఇంజినీర్లు తమ ఉద్యోగాలను వదిలేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో అన్ని విభాగాల్లో మనకు పట్టభద్రులు చాలా అవసరం. సివిల్ ఇంజినీర్లకు రూ.30-40 వేల ప్రారంభ వేతనం ఉన్నప్పటికీ తమ పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేయాలనే దృక్పథం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉన్నది. ప్రస్తుతం మన దేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఇస్తున్న సగటు ప్యాకేజీ రూ.3 లక్షలే. అంటే.. వారి నెలవారీ జీతం రూ.25 వేలు మాత్రమే. సివిల్ కంపెనీలు ఇంతకు మించి వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సివిల్, మెకానికల్ ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్‌లో రాణిస్తున్నారు. అదేవిధంగా ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చేసినవారు దర్జాగా ‘ఏఐ’లో జాబ్‌లు చేయొచ్చు. ఆ ఉద్యోగాలు చేయడానికి కేవలం ఏఐ స్పెసిఫిక్ ఇంజినీరింగ్ డిగ్రీ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. ఇంజినీరింగ్‌లో ఏ కోర్సు చేసినా ఏఐలో ఉద్యోగాలు పొందవచ్చు. ఇంజినీరింగ్ విద్యార్థులు స్కూల్‌కు వెళ్లి చదివినట్టు చదువుతున్నారు. ఇంజినీరింగ్ విద్య అంటే భవనాలు నిర్మించడం, యంత్రాలు, సాఫ్ట్వేర్లు తయారు చేయడమే. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా లేదు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఏఐ నేర్చుకుంటున్నారా లేదా అనేది సమస్యే కాదు. వారిని స్టార్టప్‌ల వైపు మళ్లించి నిష్ణాతులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది.
రమేశ్ లోగనాథన్: గత ఏడాదిన్నరగా ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏఐతో తమకు ఉపయోగం ఉందని చెప్తున్న వారిలో ఇప్పటివరకు కనీసం ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించిన దాఖలాలు లేవు. టూల్స్ ఆధారంగా కోడ్‌ను రాసే విధానం గత 25 ఏండ్ల నుంచి ఉన్నది. అది ఏటేటా మెరుగుపడుతూనే ఉంటుంది. ఉద్యోగులు పదేండ్ల క్రితం పనిచేసినట్టు ఇప్పుడు పనిచేస్తామంటే కుదరదు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సి ఉంటుంది. లేకుంటే వారికి భవిష్యత్తు ఉండదు. ఏఐ టెక్నాలజీ వల్ల ఎవరికీ ఉద్యోగాలు పోయే అవకాశం లేదు. అప్డేడ్ అవ్వనివారికి మాత్రం ఉద్యోగాలు పోతాయనడంలో సందేహం లేదు.