PAN Card | పాన్ కార్డ్.. పర్మినెంట్ అకౌంట్ నంబర్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీలకు ఇది కీలకం. ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డ్ ఉంటేనే బ్యాంకు ఖాతా తెరవడానికి అనుమతి ఇస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారికి, ఇప్పటికే చేసిన వారికి పాన్ కార్డ్ లింక్ చేస్తేనే తదుపరి పెట్టుబడులకు అనుమతి ఇస్తున్నాయి బ్యాంకులు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత, ఆర్థిక జీవితంలో ఎంతో కీలకమైంది మన పాన్ నంబర్. చాలా మందికి తమతోపాటు ఇతర్ల మొబైల్ ఫోన్ (పది నంబర్ల) నంబర్లు గుర్తు ఉంటాయి. కానీ మన పాన్ నంబర్ గుర్తు ఉండదు.
పాన్ నంబర్లో అక్షరాలు, నంబర్లు కలగలిసి ఉంటాయి. ఎల్లవేళలా గుర్తు పెట్టుకోవడం కాసింత కష్టంగానే ఉంటుంది. చూసి రాయాల్సి వచ్చినప్పుడూ గందరగోళానికి గురవుతుంటారు. నంబర్లలో సున్నా, ఆంగ్ల అక్షరాల్లో ఓ వచ్చినప్పుడు ఈ గందరగోళం తలెత్తుతూ ఉంటుంది. అలా కన్ప్యూజ్ కాకుండా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్, ట్రిక్‌లు తెలుసుకుంటే ఎల్లప్పుడూ పాన్ నంబర్ గుర్తు పెట్టుకుంటారు.. గందరగోళానికి గురి కారు.
పది అంకెలతో కూడిన నంబర్ పాన్ కార్డ్. ఇందులో అంకెలు, ఇంగ్లిష్ అక్షరాలు వస్తాయి. ఆదాయం పన్ను శాఖ అధికారులు మీకు ఆ నంబర్ కేటాయించడానికి పెద్ద కారణమే ఉంటుంది. ఈ పాన్ నంబర్లో మన పర్సనల్ డేటా కూడా దాగి ఉంటది. ఎన్ఎస్డీఎల్ ద్వారా ఆదాయం పన్నుశాఖ ఈ పాన్ కార్డులు జారీ చేస్తుంది.
మీ పాన్ నంబర్.. మీ మొబైల్ ఫోన్ నంబర్ మాదిరిగా కంప్యూటర్ జనరేటెడ్ నంబర్ కాదు. పాన్‌కార్డులో మొదటి ఐదు అక్షరాలు ఇంగ్లిష్ అక్షరాలు ఉంటాయి. అటుపై నాలుగు డిజిట్స్ నంబర్లు వస్తాయి. మళ్లీ చివర్లో ఇంగ్లిష్ అక్షరం వస్తుంది. చాలా మంది ఈ సంగతి తెలియక ఇంగ్లిష్ అక్షరాల్లో ఓ, నంబర్లలో సున్నా వచ్చినప్పుడు గందరగోళానికి గురవుతుంటారు.
పాన్ నంబర్లో మొదటి మూడు అక్షరాలు ఏఏఏ నుంచి జడ్జడ్జడ్ సిరీస్ మధ్య నుంచి ఎంపిక చేస్తారు. నాలుగో అక్షరానికి స్పెషాలిటీ ఉంటుంది. ఈ అక్షరంతో ఆదాయం పన్ను శాఖ .. మీరు ఏ క్యాటగిరీలోకి వస్తారన్న విషయం తేల్చేస్తుంది. వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులందరికీ `పీ` అక్షరం కేటాయిస్తుంది. ఇక ఐదో అక్షరం మీ ఇంటిపేరులో మొదటి ఇంగ్లిష్ అక్షరాన్ని తెలియజేస్తుంది. అలా కాకపోతే పాన్‌కార్డ్ హోల్డర్ పేరులోని మొదటి అక్షరం వస్తుంది. ఆ తర్వాత వచ్చే నాలుగు అంకెలు 0001 నుంచి 9999 మధ్య వస్తాయి. పాన్ కార్డు చివర్లోనూ ఇంగ్లిష్ అక్షరమే వస్తుంది.