Home Loans | నెల రోజుల క్రితం వరకు ఇండ్ల కొనుగోలుదారులకు అతి తక్కువ వడ్డీరేట్లకే బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో రుణాలు లభించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. అంతర్జాతీయంగా ముడి సరుకు సరఫరాలో సమస్యలతో ముడి చమురు సహా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు.. ప్రత్యేకించి కూరగాయలు, వంట నూనెల ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లాయి. మున్ముందు పైపైకే దూసుకెళ్లే సంకేతాలు కనిపించడంతో గత నెలలో 40 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచిన ఆర్బీఐ.. మొన్న 8న మరో 50 బేసిక్ పాయింట్లు పెంచింది.
దీంతో అన్ని బ్యాంకుల వడ్డీరేట్లు ఝూమ్మంటూ రాకెట్లా పైపైకి దూసుకెళ్లడం మొదలెట్టాయి. ఎంతోకాలంగా ఇల్లు కొనుక్కుందామని.. తక్కువ వడ్డీరేట్లు అమల్లో ఉన్నాయని ఆశ పడిన వారు కూడా తాజా పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తున్నారు. కానీ.. బ్యాంకుల వడ్డీరేట్లు ఎలా ఉన్నా.. ఏడు శాతం వడ్డీకే ఇండ్లు సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే సిబిల్ (క్రెడిట్) స్కోర్ మంచిగా ఉంటే సరి. ఇప్పుడే కాదు.. మున్ముందు భవిష్యత్‌లో కూడా తక్కువ వడ్డీరేట్లకే రుణాలు పొందొచ్చు..
రుణాలు పొందడంలో కీలకమైన క్రెడిట్ స్కోర్‌ను క్రెడిట్ బ్యూరో సంస్థలు తయారు చేస్తాయి. ఆర్థిక లావాదేవీల పట్ల మీరు ఎంత జాగ్రత్తగా, క్రమశిక్షణతో ఉన్నారో నిగ్గు తేల్చేదే క్రెడిట్ స్కోర్.. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇందులో క్రెడిట్ స్కోర్ 750 పాయింట్లపైనే ఉంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నారని అర్థం.
మీరు ఇంటి రుణం కోసం బ్యాంకును సంప్రదించడానికి ముందు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటే.. బ్యాంకర్ల దగ్గర తక్కువ వడ్డీరేటు కోసం బేరసారాలు చేయొచ్చు. మీకు సులువుగానే ఇంటి రుణం కూడా లభిస్తుంది. 750 పాయింట్లకు పైగా క్రెడిట్ స్కోర్ ఉంటే.. మీరు రుణాలు ఎగవేతకు పాల్పడరని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు భావిస్తుంటాయి.
క్రెడిట్ స్కోర్ 750కి పైగా ఉన్న వారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7 శాతంలోపు వడ్డీరేటుకే ఇండ్ల రుణాలిస్తున్నాయి. ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తదితర సంస్థలు, బ్యాంకులు 6.90-7.40 శాతం మధ్య వడ్డీపై హోంలోన్లు ఇస్తున్నాయి.
ఏ కారణాల వల్లనైనా మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండొచ్చు. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపర్చుకునేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. మీరు రుణ బకాయిలు వెంటవెంటనే క్లియర్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లులు కూడా సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. క్రెడిట్ కార్డు లిమిట్లో 30 శాతంలోపే వాడుకోవాలి. వెంటవెంటనే రుణాలు తీసుకోవద్దు. అప్పుడే మీ క్రెడిట్ (సిబిల్) స్కోర్ బేష్షుగ్గా ఉండటంతోపాటు తక్కువ వడ్డీకే ఎప్పుడైనా రుణాలు పొందొచ్చు.