PAN Card | ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకుల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు బ్యాంకులో ఖాతా తెరవాలంటే పాన్ కార్డు తప్పనిసరి. గతంలో ఓటరు గుర్తింపు కార్డు అన్నింటికి ఉపయోగించే వారు. తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లల వరకు ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తున్నది. ఆధార్ కార్డులు జారీ చేయకముందు ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా వాడేవారు. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపే వ్యాపార వేత్తలు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు మాత్రమే పాన్ కార్డు వాడే వారు. కాల క్రమంలో ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి రావడంతో పాన్ కార్డు తప్పనిసరి. ఇలా పాన్ కార్డు అందరి జీవితాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది.
పాన్ కార్డులో సంబంధిత వ్యక్తి జన్మించిన తేదీ, విద్యాభ్యాసం, చిరునామా, ఫోన్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు ఉంటాయి. పాన్ కార్డు నంబర్ నమోదు చేస్తే ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ తెలుస్తాయి. ఒక్కోసారి ఇంటి పేరులోనూ, అసలు పేరులోనూ తప్పులు దొర్లవచ్చు. పెండ్లయిన యువతులు పెండ్లయిన తర్వాత వారి ఇంటి పేరు మారుతుంది. వారు తమ పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలని భావించినా ఆన్లైన్లోనే తమ మొబైల్ ఫోన్లోనైనా, డెస్క్‌టాప్ కంప్యూటర్లలోనైనా ఆన్లైన్లో మార్చేసుకోవచ్చు.
మొబైల్ ఫోన్ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ ముందు కూర్చుని టీఐఎన్ ఎన్ఎస్డీఎల్ ( www.tin-nsdl.com ) అని టైప్ చేస్తే పాన్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సర్వీస్ విభాగంలోకి వెళ్లి పాన్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. కిందకు స్క్రోల్ చేస్తే Change / Correction in PAN Data సెక్షన్లోకి వెళ్లి అప్లయ్ అనే చోట క్లిక్‌మనిపించాలి. అందులో అప్లికేషన్ టైప్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో Change / Correction in existing PAN Data ఆప్షన్ ఎంచుకోవాలి.
అక్కడ పాన్ నంబర్‌తోపాటు పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేశాక మీకు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. అటుపై కింద బటన్ నొక్కి, తర్వాత ప్రక్రియలోకి వెళ్లాలి. ఇప్పుడు పాన్ కార్డ్ కరెక్షన్ పేజీ కనిపిస్తుంది. అక్కడ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఇంటి పేరు తదితర వివరాలన్నీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.
ఈ వివరాలు నమోదు చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. మీకు వెసులుబాటు గల పేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పాన్ కార్డు అప్డేట్ చేసినట్లు స్లిప్ వస్తుంది. ఆ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ స్లిప్ ప్రింటవుట్ తీసుకుని, దానిపై రెండు ఫొటోలు అతికించి, సంబంధిత ఎన్ఎస్డీఎల్ కార్యాలయానికి పంపించేస్తే.. అక్కడి నుంచి అప్డేటెడ్ పాన్ కార్డు మీకు వస్తుంది.