న్యూఢిల్లీ, మే 5 : ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను ఈ ఏడాదే అమ్మేస్తామని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం జరిగిన తొలి రెసిడెన్షియల్ మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ లిస్టింగ్ వేడుకలో పాల్గొన్న ఆయన ఐడీబీఐ విక్రయంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రముఖ జాతీయ మీడియా సంస్థ మనీకంట్రోల్‌తో పైవిధంగా స్పందించారు. కాగా, దాదాపు నెల రోజుల క్రితం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి అరుణిష్ చావ్లా మాట్లాడుతూ.. ఐడీబీఐని అమ్మేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఐడీబీఐ బ్యాంక్‌ను కొనేందుకు ఆసక్తి ఉన్నవారు బిడ్లను దాఖలు చేయగా, వాటిలో కొన్నింటిని ఎంపిక చేసినట్టూ తెలుస్తున్నది. దీనిప్రకారం కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫెయిర్‌ఫాక్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ, ఓక్ట్రీ క్యాపిటల్ వంటివి ముందు వరుసలో ఉన్నట్టు చెప్తున్నారు. కాగా, బ్యాంక్కున్న రుణగ్రహీతలు, మొండి బకాయిలు ఇతరత్రా వివరాలన్నింటినీ సమీక్షిస్తున్నట్టు సమాచారం.
ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు మెజారిటీ వాటా ఉన్నదిప్పుడు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాతో కలిపితే ఇది 95 శాతంగా ఉంటున్నది. అయితే ఇందులో 60.72 శాతం వాటాను అమ్మేందుకు అటు కేంద్రం, ఇటు ఎల్ఐసీ యోచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం 30.48 శాతం వాటాతోపాటు ఎల్ఐసీ వాటాలో మరో 30.24 శాతం వాటాను విక్రయానికి పెట్టబోతున్నట్టు తెలుస్తున్నది. కాగా, ఐడీబీఐ ప్రైవేటీకరణ ప్లాన్ ను మొదటిసారి 2021-22 బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అధిక మొండి బకాయిలు, మూలధన నిల్వల కొరత దృష్ట్యా ఎల్ఐసీ ద్వారా వాటాలను కొని బ్యాంక్‌లోకి కేంద్రం నిధులను చొప్పించిన సంగతి విదితమే. దీంతో ఐడీబీఐ ఎల్ఐసీ అనుబంధ సంస్థగా, ప్రైవేట్ బ్యాంక్‌గా మారిపోయింది. ఆ తర్వాత బ్యాంక్ ఆర్థికంగా బలపడింది. అయినప్పటికీ వాటాల విక్రయం మాత్రం సజావుగా సాగకపోవడం గమనార్హం. మొత్తానికి రెండేండ్లుగా ఐడీబీఐ అమ్మకానికి కేంద్రం తీవ్ర కసరత్తునే చేస్తున్నది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.47,000 కోట్లను సమీకరించాలని మోదీ సర్కారు యోచిస్తున్నది. ఇందులో ఐడీబీఐ వాటా విక్రయాలు కూడా ఉన్నాయి.