గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 11, 2020 , 23:50:38

ఐడీబీఐ నష్టం 5,763 కోట్లు

ఐడీబీఐ నష్టం 5,763 కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఐడీబీఐ బ్యాంకు నష్టాల పరంపర కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్‌  రూ.5,763.04 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టినప్పటికీ నష్టాలు పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలోనూ బ్యాంక్‌ రూ.4,185.48 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో బ్యాంక్‌ ఆదాయం మాత్రం రూ.6,190.94 కోట్ల నుంచి రూ.6,215.60 కోట్లకు ఎగబాకింది. ఎల్‌ఐసీ ప్రమోట్‌ చేస్తున్న ఈ బ్యాంక్‌కు మొండి బకాయిల బెడద ఇంకా వీడలేదు. గత త్రైమాసికానికిగాను బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ అడ్వాన్స్‌లో 28.72 శాతంగా నమోదయ్యాయి. 


క్రితం ఏడాది నమోదైన 29.67 శాతంతో పోలిస్తే మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. విలువ పరంగా చూస్తే రూ.55,360.38 కోట్ల నుంచి రూ.49,502. 68 కోట్లకు తగ్గాయి. అలాగే నికర ఎన్‌పీఏ మాత్రం ఏకంగా 14.01 శాతం (రూ.21, 360.49 కోట్లు) నుంచి 5.25 శాతానికి(రూ.6,805.49 కోట్లకు) తగ్గాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ కేవలం రూ.440 కోట్లు మాత్రమే కేటాయించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో బ్యాంక్‌ రూ.5,074.80 కోట్లు కేటాయించింది. కన్సాలిడేటెడ్‌ విషయానికి వస్తే రూ.6,267.23 కోట్ల ఆదాయంపై రూ. 5,728.70 కోట్ల నష్టాన్ని చవిచూసింది. స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి బ్యాంక్‌ షేరు 2.07 శాతం పెరిగి రూ.37 వద్ద ముగిసింది. 


logo
>>>>>>