న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.567 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఐడీబీఐ బ్యాంక్. ఎల్ఐసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బ్యాంక్ అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.324 కోట్ల లాభంతో పోలిస్తే 75 శాతం అధికమవడం గమనార్హం. లాభాల్లో భారీ వృద్ధి నమోదైనప్పటికీ ఆదాయంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. గత త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం 10 శాతం తగ్గి రూ.5 వేల కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.1,854 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ మార్జిన్ 3.02 శాతానికి చేరుకున్నది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 25.08 శాతం నుంచి 20.92 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ మాత్రం 1.62 శాతం నుంచి 2.67 శాతానికి చేరుకున్నాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.434.47 కోట్ల నిధులను వెచ్చించింది.