న్యూఢిల్లీ, ఆగస్టు 13: నగరాల్లో కొత్త సేవింగ్స్ అకౌంట్స్‌ను తెరవాలంటే కస్టమర్లు కనీసం రూ.50 వేలు ఖాతాలో ఉంచాల్సిందేనని ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. దీనిపై సర్వత్రా విమర్శలు చెలరేగిన నేపథ్యంలో రూ.15 వేలు ఉంచితే చాలంటున్నదిప్పుడు. అయినప్పటికీ గతంతో పోల్చితే రూ.5 వేలు ఎక్కువగానే ఉండటం గమనార్హం. కొత్త పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వలను రూ.10 వేల నుంచి రూ.50 వేలకు గత శనివారం బ్యాంక్ పెంచినది తెలిసిందే.
కాగా, సెమీ-అర్బన్ ఏరియాల్లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఖాతా కావాలంటే మినిమం బ్యాలెన్స్ రూ.25,000గా ఉండాలనగా, దాన్నీ ఇప్పుడు రూ.7,500కు తగ్గించింది. అయితే గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని పాత కస్టమర్లు తమ ఖాతాల్లో రూ.5 వేల మినిమం బ్యాలెన్స్‌ను ఉంచుకుంటే చాలన్నది ఐసీఐసీఐ. నిజానికి ఎస్బీఐ 2020లోనే ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధనను తీసేసింది. సాధారణంగా ఇతర బ్యాంకులూ రూ.2 వేల నుంచి రూ.10 వేల మధ్యే మినిమం బ్యాలెన్స్లంటున్నాయి.
సేవింగ్స్ ఖాతాల్లో కనీస నగదు నిల్వలపై ఎలాంటి మార్పుల్లేవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పష్టం చేసింది. రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచలేదన్నది. అయితే కస్టమర్లకు అందించే సౌకర్యాలనుబట్టి రకరకాల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌లు వేర్వేరుగా ఉంటాయన్నది. ప్రాంతం, కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా గరిష్ఠంగా రూ.25 వేల మినిమం బ్యాలెన్స్ ఉంటుందని, రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌కు రూ.10 వేలేనన్నది. కాగా, అర్బన్ ఏరియాల్లో రూ.10 వేలు, సెమీ-అర్బన్‌లో రూ.5 వేలు, గ్రామీణ శాఖల్లో రూ.2,500 మినిమం బ్యాలెన్స్‌గా ఉండాలి. లేదంటే.. రూ.లక్ష, 50 వేలు, 25 వేల చొప్పున వార్షిక డిపాజిైట్లెనా చేయాలి.