న్యూఢిల్లీ, ఆగస్టు 9 : ఒకవైపు పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వలపై ఉన్న చార్జీలను ఎత్తివేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఖాతాదారులకు గట్టి షాకిచ్చింది. కనీస నగదు నిల్వల మొత్తాన్ని భారీగా పెంచేసింది. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంత ఖాతాదారులపై ఈ పెంపు ప్రభావం పడనున్నదని పేర్కొంది. ఆగస్టు 1, 2025 తర్వాత తీసుకునే పొదుపు ఖాతాలకు ఈ నూతన నిబంధనలు వర్తించనున్నదని పేర్కొంది. ఈ నెల 1 తర్వాత బ్యాంక్ పొదుపు ఖాతాలో గరిష్ఠంగా రూ.50 వేల వరకు నిల్వవుంచాల్సిందేనని స్పష్టంచేసింది. మారిన నిబంధనల ప్రకారం.. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఐసీఐసీఐ సేవింగ్ ఖాతా తీసుకునేవారు తమ సగటు నిల్వలను కనీసంగా రూ.50 వేలు ఉంచాలని స్పష్టంచేసింది.
గతంలో రూ.10 వేలుగా ఉన్న ఈ పరిమితి అమాంతం ఐదు రెట్లు పెంచినట్టు అయింది. ఇక సెమీ అర్బన్ ఖాతాదారులు కనీస సగటు నిల్వల మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. అలాగే గ్రామీణ ఖాతాదారుల నిల్వలను రూ.2,500 నుంచి రూ.10 వేలకు పెంచింది. దీంతో ఆయా ఖాతాల్లో కనీస నగదు నిల్వలు లేనియెడల చార్జీలు కట్టాల్సివుంటుందని హెచ్చరించింది. ఆరు శాతం లేదా రూ.500ల్లో ఏది కనిష్ఠ స్థాయి అయితే ఆ చార్జీని విధించనున్నారు. కానీ, వేతన జీవులు, జన్‌ధన్ ఖాతాదారులు, బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఈ చార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. మరోవైపు, కనీస నగదు నిల్వలు అత్యధికంగా ఉన్న ఖాతాదారులకు బ్యాంక్ పలు ప్రయోజనాలు కల్పించింది. ఉచితంగా నెఫ్ట్ ద్వారా నగదు పంపుకోవచ్చునని, నెలకు మూడు లావాదేవీలకు ఈ నిర్ణయం వర్తించనున్నదని పేర్కొంది. ఆ తర్వాత ఒక్కో లావాదేవీలపై రూ.150 చొప్పున చార్జీని విధించనున్నారు. దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సివుంటుంది. ఆయా ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలపై 2.5 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్.
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అత్యధికంగా ఉన్న కనీస నగదు నిల్వల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఆయా బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి కొంత మొత్తాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నాయి. మరోవైపు, ఇప్పటికే ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు కనీస నగదు నిల్వలపై విధించే చార్జీలను పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే.
పొదుపు ఖాతాల్లో నగదు నిల్వలను ఐదింతలు పెంచుతూ ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ఆ బ్యాంక్‌నకు ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా బ్యాంక్‌లో పొదుపు ఖాతాలను తీసుకోవడానికి ప్రజలు వెనుకంజవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.