న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.10,261 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో లాభాల్లో 36 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. క్రితం ఏడాది ఇదే కాలానికిగాను బ్యాంక్ రూ.7,558 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.26,033 కోట్ల నుంచి రూ.34,920 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.