ICICI Credit Card Shock | కరోనా వేళ కీలక వడ్డీరేట్లు తగ్గించిన బ్యాంకులు.. కస్టమర్లపై రకరకాల చార్జీల భారం మోపుతున్నాయి. ఇప్పటికే పలు రకాల ఆంక్షలు విధించిన బ్యాంకులు ఇప్పుడు మరో కఠిన నిర్ణయానికి సిద్ధం అయ్యాయి. ఇకపై క్రెడిట్ కార్డ్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఆ దిశగా దేశంలోని ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు షాక్ ఇవ్వబోతున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసే క్రెడిట్ కార్డుల సర్వీసులపై ఇక చార్జీల మోత మోగనున్నది. క్రెడిట్ కార్డు బిల్లుల లేట్ ఫీజుతోపాటు వివిధ రకాల సర్వీస్‌చార్జీలు పెంచేసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి సవరించిన చార్జీలు, ఫీజులు అమల్లోకి వస్తాయని కస్టమర్లకు మెసేజ్‌లు పంపింది.
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్ (క్యాష్ అడ్వాన్స్) చేసుకుంటున్నారా.. అలా ఏటీఎంల నుంచి నగదు తీసుకుంటే ట్రాన్సాక్షన్ చార్జీ 2.50 శాతానికి పెంచింది. ఇది అన్ని రకాల క్రెడిట్ కార్డులకు కూడా వర్తిస్తుంది. కనీసం రూ.500 చెల్లించాల్సిందే. ఒకవేళ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపునకు జారీ చేసిన చెక్ రిటర్న్ అయినా రెండు శాతం చార్జీ పడుతుంది. అది కూడా కనీసం రూ.500 ఉంటుంది.
మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి నగదు విత్‌డ్రాయల్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. దీన్నే క్యాష్ అడ్వాన్స్ అంటారు. క్యాష్ విత్‌డ్రాయల్స్ తీసుకున్న తొలి రోజు నుంచే వడ్డీరేటు వర్తింప జేస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలు, ఫారిన్ ఎక్స్చేంజ్ క్యాష్ విత్ డ్రాయల్స్ ( foreign exchange cash withdrawals ) మీద అదనపు ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రాయల్ ఆప్షన్ కాస్ట్లీ. కనుక అత్యవసరమైతే తప్ప.. క్రెడిట్ కార్డులపై నగదు విత్ డ్రాయల్ చేయొద్దు. అంతే కాదు.. చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువ క్యాష్ విత్‌డ్రాయల్స్ చేయొద్దు. అలా చేస్తే అధిక ఫీజులు, చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
ఎమరాల్డ్ క్రెడిట్‌కార్డు మినహా ఐసీఐసీఐ బ్యాంక్ అన్ని క్రెడిట్ కార్డుల బిల్లుల లేట్ పేమెంట్స్ చార్జీలు పెంచేసింది. మొత్తం బిల్లును బట్టి ఆయా లేట్ పేమెంట్ చార్జీలు ఉంటాయి. ఉదాహరణకు మీరు చెల్లించాల్సిన బిల్లు రూ.100 లోపే ఉంటే అదనపు చార్జీలు విధించరు. బిల్లు భారీగా ఉంటే అదనపు చార్జీ కూడా ఎక్కువే ఉంటుంది. రూ.50 వేలకు పైగా క్రెడిట్ కార్డు బిల్లుపై బ్యాంక్ అత్యధికంగా రూ.1200 లేట్ ఫీజు వసూలు చేస్తుంది.
ఒకవేళ మీరు మీ క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా చెల్లించకుంటే.. ఇంటరెస్ట్ ప్రీ డేస్లోగా బిల్లులు చెల్లించలేకపోతే.. మీ వడ్డీ భారం తగ్గించుకోవడానికి క్రెడిట్ కార్డు వాడకానికి దూరంగా ఉంటే ఉత్తమం అని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. భారీ మొత్తం క్రెడిట్ కార్డు బిల్లులు ఉంటే తేలిగ్గా ఆ బిల్లులు చెల్లించడానికి వాటిని నెలవారీ వాయిదాలు (ఈఎంఐ)గా మార్చుకోవడం బెస్ట్ అంటున్నారు. ముందుగా భారీ క్రెడిట్ కార్డు బిల్లులను ఈఎంఐగా మార్చేసుకోవాలి.. తదుపరి ఏదేనీ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకుని మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేయడం బెటర్ అని అభిప్రాయ పడుతున్నారు.