Interest Rates in Banks | ఆర్బీఐ చర్యను ఊహించిన కొన్ని బ్యాంకులు ముందుగానే తమ ఎంసీఎల్ఆర్ రుణ వడ్డీరేట్లు పెంచేశాయి. గతవారం 40 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంసీఎల్ఆర్తోపాటు వడ్డీరేట్లు పెంచేశాయి. రెపోరేట్ అనుబంధ వడ్డీరేట్లు పెంచిన బ్యాంకులేవో చూద్దామా..!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎక్స్ర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఐ-ఈబీఎల్ఆర్)ను 8.10 శాతంగా ఖరారు చేసింది. ఈ నెల నాలుగో తేదీ నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల ఐదో తేదీన రిటైల్ రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా రెపోరేట్ అనుబంధ రుణ వడ్డీరేటు 6.90 శాతానికి పెంచేసింది.
కెనరా బ్యాంకు అన్ని రకాల రిటైల్ రుణాలపై రెపోరేట్ అనుసంధాన రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 7.30 శాతానికి పెంచేసింది. మే 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. మే ఒకటో తేదీ నుంచే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రిటైల్ లెండింగ్ స్కీమ్స్‌పై వడ్డీరేటు 6.80 శాతానికి పెంచివేసింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెపోరేట్ అనుబంధ ఆర్బీఎల్ఆర్ ఈ నెల నాలుగో తేదీ నుంచి 7.25 శాతానికి సవరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రెపో అనుసంధాన లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) 6.90 శాతానికి పెంచింది. ఇది ప్రస్తుత రుణ గ్రహీతలకు వచ్చే ఒకటో తేదీ నుంచి, నూతన కస్టమర్లకు ఈ నెల ఏడో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది.
గత నెల రోజులుగా పలు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ సవరించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అన్ని టెన్యూర్ల రుణ గ్రహీతలపై ఎంసీఎల్ఆర్ 25 బేసిక్ పాయింట్లు పెంచేశాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి ఎంసీఎల్ఆర్ 7.15 శాతం అమల్లోకి తెచ్చింది. ఇంతకుముందు ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉండేది. ఏడాది గడువుగల రునాలపై ఎంసీఎల్ఆర్ 7.50 శాతం, రెండేండ్ల గడువు గల రుణాలపై 7.60 శాతం, మూడేండ్ల గడువు గల రుణాలపై 7.70 శాతం ఖరారు చేసింది.
ఎస్బీఐ ఇటీవలే తన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిక్ పాయింట్లు పెంచింది. గత నెల 15 నుంచి అమల్లోకి తెచ్చింది. ఓవర్‌నైట్, నెల, మూడు నెలల గడువు రుణాలపై 6.75 శాతం, ఆరు నెలల రుణాలపై 7.05 శాతంగా ఖరారు చేసింది. ఏడాది గడువు గల రుణంపై 7.10, రెండేండ్ల గడువు గల రునంపై 7.30 శాతం, మూడేండ్ల గడువుపై 7.40 శాతంగా ఎంసీఎల్ఆర్ సవరించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నెల ఒకటో తేదీ నుంచి తన ఎంసీఎల్ఆర్ను 6.60-7.70 శాతం మధ్య సవరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 6.60-7.55 శాతం మధ్య పెంచివేసింది. ఈనెల రెండో తేదీ నుంచి యెస్ బ్యాంక్ అన్ని రుణాలపై ఎంసీఎల్ఆర్ 10-15 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీని ప్రకారం యెస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 6.85 – 8.60 శాతం మధ్య పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ గత నెల 18న ఎంసీఎల్ఆర్ ఐదు బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.15-7.30 శాతం మధ్య ఖరారైంది.