ICICI Bank Alert | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ ( ICICI Bank ) తన క్రెడిట్ కార్డు యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె ( Rental Payment ) చెల్లిస్తున్న వారిపై కొత్తగా ఒకశాతం చార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన కస్టమర్లకు మెసేజ్ పంపింది. `డియర్ కస్టమర్స్.. 2022 అక్టోబర్ 20 నుంచి ఇంటి అద్దె చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డుతో చేసే లావాదేవీలపై ఒకశాతం ఫీజు వసూలు చేస్తున్నాం` అని పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తున్న ఖాతాదారుల నుంచి చార్జీ వసూలు చేస్తున్న తొలి బ్యాంకుగా ఐసీఐసీఐ బ్యాంక్ ( ICICI Bank ) నిలిచింది.
రెడ్ గిరాఫీ (RedGiraffe), మైగేట్ (Mygate), క్రెడ్ (Cred), పేటీఎం (Paytm), మ్యాజిక్‌బ్రిక్స్ (Magicbricks) పలు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ తమ యూజర్లు క్రెడిట్ కార్డుద్వారా ఇంటి అద్దె చెల్లించడానికి అనుమతి ఇస్తున్నాయి. ఈ సేవలపై సర్వీస్ చార్జీ కూడా వసూలు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ పే చేసేవారు సంబంధిత ప్లాట్‌ఫామ్‌పై తమ క్రెడిట్‌కార్డు వివరాలు నమోదు చేయాలి. అటుపై రెంట్ పేమెంట్ ఆప్షన్ కింద పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ లేదా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), ఇంటి యజమాని పేరు నమోదు చేశాక.. సంబంధిత చెల్లింపులు పూర్తి చేయాలి.
ఉదాహరణకు మీరు ప్రతి నెలా క్రెడిట్ కార్డు ద్వారా రూ.12 వేలు ఇంటద్దె చెల్లిస్తున్నారనుకుందాం.. మీరు వాడుతున్న ప్లాట్‌ఫామ్.. రెంటల్ పేమెంట్ సేవలందించినందుకు మీ నుంచి 0.4 నుంచి రెండు శాతం వరకు చార్జీ వసూలు చేస్తాయి. దీని ప్రకారం సంబంధిత పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ మీ క్రెడిట్ కార్డు నుంచి రూ.12,240 వసూలు చేస్తాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ విధించనున్న ఒకశాతం చార్జీ రూ.120.. మొత్తం రూ.12,360 అవుతుంది. అంటే ఐసీఐసీఐ కార్డుపై రెంట్ చెల్లిస్తున్న వారు ఏటా రూ.2880 అదనపు సర్వీస్ చార్జీ చెల్లించాలన్నమాట.
సాధారణంగా క్రెడిట్ కార్డుతో ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రాయల్ చేస్తే సంబంధిత బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి భారీగా అంటే 2.5-3 శాతం చార్జీలు వసూలు చేస్తాయి. దీన్ని తప్పించుకునేందుకు చాలా మంది రెంటల్ పేమెంట్ ఆప్షన్ వినియోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒకటి రెండు ప్లాట్‌ఫామ్‌లకు తప్ప రెంటల్ పేమెంట్ సేవలందిస్తున్న ప్లాట్‌ఫామ్స్‌లో ఆ సేవల నిర్ధారణకు సరైన వ్యవస్థే లేదు. దీంతో యూజర్లు తమ బంధు మిత్రుల ఇండ్ల అద్దెలు చెల్లించడానికి తమ క్రెడిట్ కార్డు వాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి వద్ద నగదు తీసుకునే క్రెడిట్ కార్డు యూజర్లు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారని సమాచారం.