న్యూఢిల్లీ, మార్చి 1: వాహన ఉత్పత్తి సంస్థలకు ఫిబ్రవరి నెల షాకిచ్చింది. ధరలను పెంచుతూ వాహన ఉత్పత్తి సంస్థలు తీసుకున్న నిర్ణయంతో కొనుగోలుదారులు వెనుకంజవేశారు. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అమ్మకాలు స్వల్పంగా పెరరగా.. హ్యుందాయ్, టాటా మోటర్స్ సేల్స్ భారీగా తగ్గాయి. వాహనాలకు డిమాండ్ పడిపోవడం వల్లనే తగ్గాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు, మహీంద్రా, టయోటా కిర్లోస్కర్లు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో పన్ను సంస్కరణలు, లిక్విడిటీని పెంచడానికి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో డిమాండ్‌ను పెంచుతాయన్న విశ్వాసాన్ని హ్యుందాయ్ మోటర్ సీఈవో తరుణ్ గార్గ్ వ్యక్తంచేశారు.