న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు లైన్ క్లియరైంది. దాదాపు 3 బిలియన్ డాలర్ల (రూ.25,000 కోట్లు) నిధుల సమీకరణే లక్ష్యంగా వస్తున్న ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దేశంలోనే అతిపెద్దది కానున్నది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. ఈ మెగా ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ఈ ఏడాది జూన్‌లో ఐపీవో కోసం సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ను హ్యుందాయ్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటిదాకా దేశ చరిత్రలో ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోనే అతిపెద్దది. దీని విలువ 2.7 బిలియన్ డాలర్లు. హ్యుందాయ్ పబ్లిక్ ఇష్యూ వస్తే దీన్ని అధిగమించనున్నది.
పలు చిన్నచిన్న ఐపీవోల నిర్వహణలో పాలుపంచుకున్న 6 స్థానిక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన సెబీ.. ఆ వ్యవహారంపై విచారణ చేస్తున్నది. ఆయా ఐపీవోల్లో సేకరించిన నిధుల్లో 1-3 శాతానికి బదులుగా 15 శాతం ఫీజులు ఇవి తీసుకున్నట్టు తెలుస్తున్నది.