Hyundai | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని కార్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ప్రామాణికంగా ఏర్పాటు చేస్తామని మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారత్ ఎన్-క్యాప్ రేటింగ్స్‌లోనూ స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిపింది. తొలుత మూడు మోడల్ కార్లతో ప్రారంభించి.. తర్వాతీ దశలో మిగతా మోడళ్లకు విస్తరిస్తామని పేర్కొంది.
భారత్ ఎన్-క్యాప్ ప్రోగ్రామ్ కింద తమ కార్ల స్టాండర్డ్‌ను పరీక్షించేందుకు కార్ల తయారీ సంస్థలన్నీ స్వచ్ఛందంగా ఆ కార్యక్రమంలో చేరాలని కేంద్రం సూచించింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్) 197కు అనుగుణంగా కార్ల సేఫ్టీ టెస్టింగ్ కోసం భారత్ ఎన్-క్యాప్ ప్రోగ్రామ్‌లో చేరాల్సి ఉంటుంది. ఈ టెస్టింగ్‌లో ఆయా కార్ల పెర్ఫార్మెన్స్ ఆధారంగా వాటికి 0-5 స్టార్ రేటింగ్ ఇస్తుంది భారత్ ఎన్-క్యాప్.
కార్ల కొనుగోలుదారులు తమ శక్తి సామర్థ్యాన్ని బట్టి.. వారు కొనుగోలు చేసే వాహనాల సేఫ్టీ స్టాండర్డ్ ను పరిశీలించిన తర్వాతే ఆయా కార్లను కొనుగోలు చేస్తారు. మిడ్ సెడాన్ వెర్నా మోడల్ కారుకు అడల్ట్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. తమ కంపెనీ కార్లలో సేఫ్టీకి ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ ఉన్సూ కిమ్ పేర్కొన్నారు.