Hyundai Motor | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుండాయ్ (Hyundai)’ అనుబంధ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రూ.25 వేల కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో వస్తున్న హ్యుండాయ్ మోటార్ ఐపీఓ ఈ నెల 14న ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఇంతకుముందు రూ.21 వేల కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీఓ అతిపెద్దది. కానీ ఐపీఓకు వెళ్లేందుకు గత జూన్ నెలలో సెబీకి హ్యుండాయ్ మోటార్ ఇండియా సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) ప్రకారం ఎల్ఐసీ కంటే హ్యుండాయ్ ఐపీఓ లక్ష్యం అతిపెద్దదని భావిస్తున్నారు.
ఐపీఓ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ కింద 14,21,94,700 ప్రమోటర్ ఈక్విటీ షేర్లను హ్యుండాయ్ మోటార్ ఇండియా విక్రయించనున్నదని సమాచారం. తద్వారా కనీసం 300 కోట్ల డాలర్లు (రూ.25 వేల కోట్లు) నిధులు సేకరించాలని హ్యుండాయ్ తలపెట్టినట్లు తెలిసింది. 2003లో జపాన్-భారత్ జాయింట్ వెంచర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఐపీఓ తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమలో వస్తున్న ఆటోమొబైల్ సంస్థ ఐపీఓ మొదటిది కానున్నది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా దక్షిణ కొరియా సంస్థ హ్యుండాయ్ తన ప్రమోటర్ వాటాలో 15-20 శాతం విక్రయిస్తుందని తెలుస్తోంది. గత నెల 24న హ్యుండాయ్ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం భారత్ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి తర్వాత హ్యుండాయ్ మోటార్ ఇండియాదే స్థానం. 1996లో భారత్ మార్కెట్లోకి ఎంటరైన హ్యుండాయ్.. ప్రస్తుతం వివిధ సెగ్మెంట్లలో 13 కార్లను విక్రయిస్తోంది.