న్యూఢిల్లీ, జూన్ 17: హ్యుందాయ్ మోటర్ ఇండియా.. విద్యుత్తు ఆధారిత వాహనాలపై (ఈవీ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరు (వచ్చే ఏడాది జనవరి-మార్చి)కల్లా దేశీయ మార్కెట్కు 4 ఎలక్ట్రిక్ వెహికిల్ మాడళ్లను పరిచయం చేయాలనుకుంటున్నది. వీటిలో పాపులర్ క్రెటా మాడల్ కూడా ఉన్నది. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) పేపర్లలో హ్యుందాయ్ పేర్కొన్నది. అయితే ధర, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదన్న వివరాలు తెలియరాలేదు. రూ.25,000 కోట్ల భారీ ఐపీవోతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి హ్యుందాయ్ ప్రవేశించాలనుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీల సందడి ఎక్కువగా కనిపిస్తున్నది. పర్యావరణ సమస్యలు, ఇంధన ధరల నడుమ వినియోగదారులు సైతం ఈవీ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. ఇక టాటా మోటర్స్ మిగతా అన్నింటికంటే ఎక్కువ మాడళ్లతో మార్కెట్లో దూసుకుపోతున్నది. దీంతో ఈ పోటీలో ముందు నిలిచేందుకు హ్యుందాయ్ కూడా క్రెటాసహా మరికొన్ని ఈవీ మాడళ్లను తేవాలని నిర్ణయించుకున్నది. ఈ క్రమంలోనే భారత్లో సెల్స్, బ్యాటరీ ప్యాక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ తదితర విడిభాగాల ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే అయోనిక్5, కోనా ఎలక్ట్రిక్ కార్లను హ్యుందా య్ దేశీయంగా విక్రయిస్తున్నది విదితమే. రూ.45 లక్షలు, రూ.24 లక్షల శ్రేణిలో వీటి ధరలున్నాయి. ఇదిలావుంటే ఈవీ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణంపైనా సంస్థ ఆసక్తి చూపుతున్నది. దేశవ్యాప్తంగా కంపెనీకి 11 చార్జింగ్ స్టేషన్లున్నాయి. జాతీయ రహదారులపై అన్ని నగరాల్లో మరిన్ని తేవాలని చూస్తున్నది.