న్యూఢిల్లీ : కొత్త ఏడాది నుంచి కార్ల ధరలు భారం కానున్నాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, కియా, రెనాల్ట్ వంటి పలు ఆటోమొబైల్ కంపెనీల తరహాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సైతం వాహన ధరలను పెంచనున్నట్టు వెల్లడించింది. 2023 జనవరి నుంచి ధరల పెంపు వర్తిస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. అన్ని వాహనాలు, మోడల్స్ ధరలను పెంచనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది.
ఉత్పత్తి వ్యయం, ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే కార్ల ధరల పెంపు అనివార్యమైందని హ్యుందాయ్ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఉత్పత్తి వ్యయ భారాన్ని తాము భరించినా జనవరి నుంచి వ్యయాల పెంపు భారాన్ని కస్టమర్లకు మళ్లించకతప్పలేదని కంపెనీ తెలిపింది. అయితే వాహన ధరలను ఎంత మొత్తం, ఎంత శాతం పెంచనుందనే వివరాలను హ్యుందాయ్ వెల్లడించలేదు.
ఇక నెలాఖరులో కంపెనీ ధరల పెంపు వివరాలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హ్యుందాయ్ ఇండియా ప్రస్తుతం దేశీ మార్కెట్లో గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ20, ఐ20 ఎన్లైన్, కోన ఎలక్ట్రిక్, ఆరా, వెర్నా, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, క్రెటా, అల్కాజర్, టక్సన్ కార్లను విక్రయిస్తోంది. గ్లోబల్ ఈవీ, ఐకానిక్ 5ను భారత్ మార్కెట్లో లాంఛ్ చేసేందుకు హ్యుందాయ్ సన్నాహాలు చేపట్టింది.