హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా సాఫ్ట్వేర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్(హైసియా) ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇటీవల కొత్తగా ఏర్పాటైన హైసియా మేనేజ్మెంట్ కమిటీ నాలుగు ప్రధాన అంశాలతో రెండేండ్ల కాలానికి సంబంధించిన ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ప్రకటించింది.
మెంటర్ ఎంగేజ్మెంట్, ప్యూచర్ రెడినెస్, థాట్ లీడర్షిప్, గవర్నమెంట్ రిలేషన్స్ అండ్ పాలసీ అంశాలతో వ్యూహాత్మక విజన్ 2024-26ను రూపొందించింది. మెంబర్ ఎంగేజ్మెంట్లో భాగంగా ఐటీ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా విద్య, పర్యావరణం, ఆరోగ్య విభాగాల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా స్టార్టప్‌లను ప్రోత్సహించడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచేలా చర్యలు తీసుకోవడం, ఐటీ పరిశ్రమకు అవసరమైన అంశాలపై ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చించడం వంటి అంశాలు ప్రధాన అజెండాగా హైసియా ఈ కార్యాచరణను రూపొందించింది.